Share News

కుంభకోణాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే..

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:47 AM

కుంభకోణాలు చేయటంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విధానాలు ఒకేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు అన్నారు.

కుంభకోణాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే..

  • కాంట్రాక్టర్లు, మంత్రులు మారారు తప్ప కమీషన్ల విధానం మారలేదు

  • గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుంభకోణాలపై నోటీసులతోనే సరి

  • అన్ని అవినీతి కేసులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌

హైదరాబాద్‌, జనవరి 29(ఆంధ్ర జ్యోతి): కుంభకోణాలు చేయటంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విధానాలు ఒకేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణ జరిపించటం లేదని, నోటీసుల పేరుతో ప్రచారం చేసుకోవటానికే పరిమితమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో యాక్టింగ్‌ మాత్రమే కనిపిస్తోందని మండిపడ్డారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలపై సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణంపై ఎలాంటి విచారణ జరపటం లేదని ఆరోపించారు. నైనీ బొగ్గు గని విషయంలో కూడా బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న కాంట్రాక్టు విధానాన్నే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. కాంట్రాక్టర్లు, మంత్రులు మారారు తప్ప కమీషన్ల విధానం అలాగే కొనసాగుతోందని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై విచారణ సీరియ్‌సగా జరగడం లేదని విమర్శించారు. మద్యం పాలసీ విషయంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నామని స్వయంగా కాంగ్రెస్‌ మంత్రులే చెబుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే బీఆర్‌ఎస్‌ కుంభకోణాలపై విచారణ జరిపి కేసీఆర్‌ను జైలుకు పంపుతానన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు ఏమయ్యాయని రాంచందర్‌రావు నిలదీశారు. సిట్‌ విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ప్రధాన నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై కాకుండా, మొత్తం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని రాంచందర్‌రావు ఆరోపించారు. రానున్న మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు బుద్ధిచెప్పి బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. మీడియా సమావేశంలో మాధవి, ఎన్‌వీ సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 03:47 AM