Share News

రేవంత్‌పై బీజేపీ మైండ్‌గేమ్‌!

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:42 AM

తెలంగాణలో పాగా వేయాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందుకోసం సరికొత్త వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బతీయడం ద్వారా ఆ స్థానంలోకి రావాలని ....

రేవంత్‌పై బీజేపీ మైండ్‌గేమ్‌!

  • కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌రెడ్డిని దూరం చేసి.. తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలు

  • అపోహలు సృష్టించడానికి మీనాక్షీ.. నామినేషన్‌ తిరస్కరణ తెరపైకి

  • ‘మాతో చేతులు కలపాలి’ అంటూ.. మోదీ చేసిన ప్రకటనపై రాజకీయం

  • అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి చెబుతున్న రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పాగా వేయాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందుకోసం సరికొత్త వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బతీయడం ద్వారా ఆ స్థానంలోకి రావాలని భావిస్తోంది. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిచ్చు పెట్టేలా మైండ్‌గేమ్‌కు తెరతీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ వ్యవహారాన్ని కూడా ఇందుకు అస్త్రంగా బీజేపీ వాడుకుందని అంటున్నారు. ఇటీవల ముగిసిన అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల అనంతరం బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందనే ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీ ఎత్తుగడలు ఉంటున్నాయి. మధ్యప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణకు సంబంధించిన కేసు పత్రాలు తమకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచే అందాయని చెప్పడం కలకలం రేపింది. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వాస్తవానికి మీనాక్షితోపాటు పలువురిపై కేసు నమోదు చేయాలని కోర్టులో ప్రైవే ట్‌ పిటిషన్‌ వేయగా... ఆ కేసులో నోటీసులు రావడం, మీనాక్షి బదులివ్వడం కూడా జరిగింది. అయితే ఈ కేసు విషయాన్ని నామినేషన్‌లో పొందుపరచాలా? వద్దా? అన్నదానిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపాల్సి ఉండగా.. అదేమీ చేయలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్లు వేసేటప్పుడు కచ్చితంగా న్యాయ నిపుణులు అన్ని విషయాలను పరిశీలిస్తారు. నామినేషన్‌ పత్రాల్లో వివరాలను కూడా రాస్తారు.


మీనాక్షి నామినేషన్‌ అస్త్రంగా పావులు..

మీనాక్షి నటరాజన్‌ ఏఐసీసీ తరపున జాతీయ కోటాలో నామినేషన్‌ వేసినందున దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేసులు ఉన్నాయా?అనే వివరాలను తెప్పించుకుంటారు. న్యాయపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మీనాక్షి నుంచి తీసుకుంటారు. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇక్కడ ఆ కసరత్తు జరిగిందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ, మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణకు గురవడం ఒక ఎత్తయితే.. ఆ అంశం ఆధారంగా రేవంత్‌రెడ్డిపై అపోహలు సృష్టించేందుకు బీజేపీ పావులు కదపడం మరో ఎత్తుగా మారింది. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధిస్తూనే ఉంది. దాంతో రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి దెబ్బతీయడానికి మైండ్‌ గేమ్‌ను బీజేపీ ప్రారంభించినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌ మంత్రి కైలాష్‌ విజయవర్గీయ చేసిన ప్రకటన అందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదటి నుంచి టార్గెట్‌గా రేవంత్‌..

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే బీజేపీ ఆయనను టార్గెట్‌ చేసిందని అంటున్నారు. తొలినాళ్లలోనే ఆయనకు ఆర్‌ఎ్‌సఎస్‌తో సంబంధాలు ఉన్నాయని ప్రకటించింది. ఆ తర్వాత ప్రధాని మోదీని బడేభాయ్‌గా సంబోధిస్తూ రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనను రాజకీయంగా బీజేపీ వినియోగించుకుంది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం తెలంగాణకు వచ్చిన మోదీ ‘మాతో చేతులు కలపాలి’ అంటూ చేసిన ప్రకటనను కూడా బీజేపీ రేవంత్‌ను టార్గెట్‌ చేయడానికి ఉపయోగించింది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దక్షిణాదిలోని ప్రభుత్వాలతో కలిసి రేవంత్‌రెడ్డి చేస్తున్న పోరాటంపై బీజేపీ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి నిధులు తీసుకుంటూ... అదే స్థాయిలో నిధులు ఇవ్వడం లేదని రేవంత్‌ రెడ్డి చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం బిల్లు తేవడానికి ముందే దక్షిణాదిలో కీలక ఉద్యమానికి రేవంత్‌రెడ్డి పురుడుపోశారు. ఆ తర్వాత బిల్లు వీగిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేసే దిశగా బీజేపీ ఎత్తుగడలువేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణను అదనుగా చేసుకొని రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి అనుమానాలు కలిగేలా ప్రకటనలు చేస్తోందని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి దూరం చేస్తే తప్ప.. తాము అధికారంలోకి రాలేమనే ఎత్తుగడతోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నట్లు హస్తం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రేవంత్‌రెడ్డి మాత్రం ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి చెబుతున్నారని సమాచారం. మంగళ, బుధవారాల్లో అనేక పర్యాయాలు అదిష్ఠానం, రేవంత్‌కు మధ్య ఫోన్‌ సంభాషణలు జరిగాయని తెలిసింది. అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఈ అంశాలపై రేవంత్‌ చర్చించినట్లు సమాచారం.

Updated Date - Jun 11 , 2026 | 04:42 AM