Share News

శాంతిభద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యమే

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:55 AM

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు.

శాంతిభద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యమే

  • హింసాత్మక ఘటనలపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

  • బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్‌ ఘటనల ప్రస్తావన

  • ఉత్తర తెలంగాణలో మజ్లిస్‌ అరాచకాలు

  • ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారు?

  • రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలపై రాంచందర్‌రావు నేతృత్వంలో బీజేపీ బృందం డీజీపీకి ఫిర్యాదు లేఖను సమర్పించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డి పట్టణం, నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లో జరిగిన 3 ఘటనలను లేఖలో ప్రస్తావించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీజేపీ కార్యకర్తలపై మోపిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. డీజీపీ శివధర్‌ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాన్సువాడ, నిజామాబాద్‌, కామారెడ్డి ఘటనల గురించి ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు గుంపుగా వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మజ్లీస్‌ పార్టీకి చెందిన వారి సహకారం కూడా ఇందులో ఉందన్నారు. నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లో స్థానిక న్యాయవాది కళ్యాణిపై దాడి అత్యంత అమానుషమని చెప్పారు. ఉత్తర తెలంగాణలో మజ్లిస్‌ అరాచకాలు పెరుగుతున్నాయన్నారు. ఆలయాలపై దాడుల వెనుక ఎవరు ఉన్నారని రాంచందర్‌ రావు ప్రశ్నించారు.


ప్రజలకు రాహుల్‌ క్షమాపణ చెప్పాలి

దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఏఐ అంతర్జాతీయ సదస్సులో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం యాదృచ్ఛికం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావు చెప్పారు. రాహుల్‌ గాంధీ చేయించిన సిగ్గుమాలిన చర్య అని, దేశ ప్రతిష్ఠను దిగజార్చేదన్నారు. పేరు చివరన గాంధీ పేరు పెట్టుకోగానే గాంధీలు అయిపోరని ఆయన రాహుల్‌ను ఎద్దేవా చేశారు. దేశ ప్రజలకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు బీఆర్‌ఎస్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రాంచందర్‌ రావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

కగార్‌ వల్లే మావోయిస్టుల లొంగుబాటు

ఆపరేషన్‌ కగార్‌తో పెద్దఎత్తున నక్సలైట్లు లొంగిపోతున్నారని, తెలంగాణలో కూడా మావోయిస్టు అగ్ర నేతలు సరెండర్‌ అయ్యారని ఆయన చెప్పారు. ఇది కేంద్రం తీసుకుంటున్న చర్యలకు లభిస్తున్న స్పష్టమైన ఫలితమని పేర్కొన్నారు. 45 ఏళ్లగా మావోయిస్టుల ఉద్యమం భూస్వాములను కాపాడడానికే పరిమితమైందన్నారు. ప్రొఫెసర్ల ముసుగులో కొందరు కుహనా మేధావులు అర్బన్‌ నక్సల్స్‌గా, దేశ వ్యతిరేక శక్తులుగా మారి, విద్యార్థులను దేశానికి వ్యతిరేకంగా పనిచేేసలా తయారు చేస్తున్నారని రాంచందర్‌ రావు ఆరోపించారు.

Updated Date - Feb 26 , 2026 | 02:55 AM