ధాన్యం కొనుగోళ్లలో కమీషన్ల దందా!
ABN , Publish Date - May 29 , 2026 | 04:03 AM
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు
రైతుల గోసను సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదు
ఈ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు
‘రైతు గోస-బీజేపీ భరోసా’లో ఏలేటి
రైతులను ఆదుకోవాలి: ఈటల
సారంగాపూర్/దిలావర్‌పూర్, మే 28 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను మరిచిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ‘రైతు గోస- బీజేపీ భరోసా’ యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం పత్తి మార్కెట్ యార్డును బీజేపీ ఎమ్మెల్యేలు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ నాయకులు కమీషన్ల దందా చేస్తున్నా రని ఆరోపించారు. తమ సమస్యలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి రైతులు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. కాగా, అంతకుముందు జిల్లాలోని సోన్, మామడ, దిలావర్‌పూర్, ఖానాపూర్, కడెంలో నిర్వహించిన యాత్రలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలు వీడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సాగు కోసం భూములను సిద్ధం చేసుకునే సమ యంలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి రావడం దారుణమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే నని విమర్శించారు. ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాయల్ శంకర్, రాకేశ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, సూర్య నారాయణ, హరీశ్‌బాబు పాల్గొన్నారు.