గిరిజన ప్రాంతాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:37 AM
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు..
ఐటీడీఏ నిధులతోనే ఏజెన్సీల్లో అభివృద్ధి: బీజేపీ
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినా.. సరైన నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా అందిస్తున్న నిధులతోనే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. సేవాలాల్ జీవితం బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడే దేవుడిగా సేవాలాల్ మహారాజ్‌ను గిరిజన సమాజం భావిస్తుందని తెలిపారు. ట్రైబల్ కమిషన్, ప్రత్యేకంగా ట్రైబల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు వంటివి మోదీ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నారు. ములుగులో సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతో గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడ్డాయని వివరించారు.