Share News

‘సర్‌ ’పై కాంగ్రెస్‌ ద్వంద్వవైఖరి

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:23 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దుయ్యబట్టారు.

‘సర్‌ ’పై కాంగ్రెస్‌ ద్వంద్వవైఖరి

  • కార్యక్రమాన్ని రేవంత్‌ వ్యతిరేకిస్తూనే

  • సీరియ్‌సగా తీసుకోవాలని మంత్రులకు చెబుతున్నారు

  • రాజ్యాంగంపై రాహుల్‌కు కనీస అవగాహన లేదు: రాంచందర్‌రావు

  • ఎమర్జెన్సీ విధించి ఇందిర దేశాన్నే జైలుగా మార్చారు: విద్యాసాగర్‌రావు

హైదరాబాద్‌,జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దుయ్యబట్టారు. ‘సర్‌’ను వ్యతిరేకిస్తున్నట్లు ఒకవైపు స్పష్టం చేస్తూనే, మరోవైపు, మంత్రులంతా కూడా ఈ ప్రక్రియను సీరియ్‌సగా తీసుకోవాలని సీఎం రేవంత్‌ సూచించడం కాంగ్రెస్‌ ద్వంద్వవైఖరికి అద్దం పడుతోందన్నారు. ఇక పార్టీ కనుమరుగవుతుండటం, పోలింగ్‌బూత్‌ స్థాయిలో కేడర్‌ను కోల్పోవడం వల్లనే ‘సర్‌’ను బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ‘సర్‌’తో ఒకవేళ బీజేపీకి లబ్ధి చేకూరితే కేరళంలో కాంగ్రెస్‌ ఎలా గెలిచిందో చెప్పాలని ఆయన బీఆర్‌ఎ్‌సకు సవాల్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియా సమావేశంలో, అలాగే సంవిధాన్‌ హత్యా దివస్‌ (ఎమర్జెన్సీ వ్యతిరేక దినం) సమావేశంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సి.హెచ్‌. విద్యాసాగర్‌ రావు, హరియాణ మాజీ గవర్నర్‌ దత్తాత్రేయతో కలిసి మాట్లాడారు. ‘సర్‌’పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘సర్‌’ అనేది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇది ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియ. ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశం. దేశంలో ఇప్పటికే 10 సార్లు ‘సర్‌ ’ నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అనవసర భయాందోళనలు సృష్టిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే అసలైన ఓటర్లు మాత్రమే జాబితాలో ఉండాలి. ‘సర్‌ ’ ఏ సమాజానికి, ఏ నిజమైన భారతీయ పౌరుడికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం డూప్లికేట్‌ ఓట్లు, నకిలీ ఓట్లు, మరణించిన ఓటర్ల పేర్లు, అక్రమ నమోదు వంటి అంశాలను గుర్తించి తొలగించడానికి మాత్రమే ఉద్దేశించింది’ అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. పవిత్ర రాజ్యాంగ పీఠికను (ప్రియాంబుల్‌) 42వ సవరణ ద్వారా మార్చేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని, ఎమర్జెన్సీ విధించడం ద్వారా ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తే.. రాహుల్‌ గాంధీ ఆ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారని.. ఆయనకు రాజ్యాంగంపై కనీస అవగాహన లేదని విమర్శించారు. తన పదవి కాపాడుకోవడం కోసమే అప్పట్లో ఇందిర ఎమర్జెన్సీ విధించారని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. ఎమర్జెన్సీతో యావత్‌ దేశాన్నే ఒక జైలుగా మార్చారని ఆరోపించారు.

Updated Date - Jun 26 , 2026 | 04:23 AM