మూడు నిమిషాల్లో కాలేయ వ్యాధి నిర్ధారణ
ABN , Publish Date - May 30 , 2026 | 03:57 AM
కాలేయ సంబంధిత వ్యాధులను కేవలం మూడు నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక చేతి పరికరాన్ని బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్, అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు.
పరికరాన్ని రూపొందించిన బిట్స్ పిలానీ, అమెరికా పర్డ్యూ వర్సిటీ పరిశోధకులు
బిట్స్ పిలానీ, మే 29 (ఆంధ్రజ్యోతి): కాలేయ సంబంధిత వ్యాధులను కేవలం మూడు నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక చేతి పరికరాన్ని బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్, అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆస్పత్రులకు, డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడైనా సులభంగా పరీక్షలు నిర్వహించేలా ఈ పరికరాన్ని రూపొందించారు. కాలేయ పనితీరును అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించే బిలిరూబిన్ స్థాయులను ఈ పరికరం అత్యంత కచ్చితంగా గుర్తిస్తుంది. బిలిరూబిన్ స్థాయులు పెరగడం అంటే.. కామెర్లు, కాలేయ వ్యాధులు లేదా రక్త సంబంధిత సమస్యలకు సంకేతంగా భావిస్తారు. బిట్స్ పిలానీ హైదరాబాద్‌లోని సూక్ష్మ యాంత్రిక వ్యవస్థలు, సూక్ష్మ ద్రవ సాంకేతికత, నానో ఎలకా్ట్రనిక్స్ పరిశోధన కేంద్రంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది స్మార్ట్‌ఫోన్ కంటే కొద్దిగా పెద్దదిగా ఉండి, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా ఉంటుంది. సాధారణంగా బిలిరూబిన్ పరీక్ష కోసం రక్త నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపాల్సి వస్తుంది. రిపోర్ట్ రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. కానీ, ఈ కొత్త పరికరం ద్వారా రక్తనమూనా సేకరించి.. మూడు నిమిషాల్లో ఫలితాలను పొందవచ్చు. ఫలితాలను వెంటనే మొబైల్ ఫోన్‌కు పంపే సదుపాయం కూడా ఇందులో ఉంది. ఈ పరికరంలో ఒకసారి మాత్రమే ఉపయోగించగల ప్రత్యేక సెన్సర్‌ను అమర్చారు. దీనిపై బంగారు నానోకణాలు, ప్రత్యేక రక్షణ పొరను పూతగా ఉపయోగించారు. ఈ సాంకేతికత వల్ల బిలిరుబిన్‌ను అత్యంత ఖచ్చితంగా గుర్తించడంతో పాటు ఇతర రసాయన పదార్థాల ప్రభావం పరీక్ష ఫలితాలపై పడకుండా నిరోధిస్తుంది. ‘‘మా లక్ష్యం అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడం. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే నర్సులు సైతం ఈ పరికరాన్ని సులభంగా ఉపయోగించగలరు. ఇది జేబులో పెట్టుకుని తీసుకెళ్లేంత చిన్నదిగా ఉంటుంది. భవిష్యత్తులో ఇతర వ్యాధులకు సంబంధించిన జీవసూచకాలను గుర్తించేలా దీనిని మరింత అభివృద్ధి చేసే అవకాశముంది’’ అని ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ సంకేత్ గోయల్ తెలిపారు. బ్యాటరీతో పాటు, నేరుగా విద్యుత్ సరఫరాతో కూడా ఈ పరికరం పనిచేస్తుంది. త్వరలో దీనితో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రామాణిక వైద్య పరీక్షలతో పోల్చి చూస్తే.. ఈ పరికరం ఇచ్చిన ఫలితాలు అత్యంత విశ్వసనీయంగా ఉన్నాయని దీని రూపకర్తలు తెలిపారు. కాలేయ వ్యాధుల నిర్ధారణను వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో ఈ ఆవిష్కరణ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.