తక్కువ విద్యుత్‌తోనే శీతలీకరణ
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:10 AM
శీతలీకరణ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీసే సాంకేతికతను బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
కొత్త ఏసీ సాంకేతికతను అభివృద్ధి చేసిన బిట్స్
బిట్స్ పిలానీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): శీతలీకరణ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీసే సాంకేతికతను బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బృందం రూపొందించిన ఈ కొత్త ఎయిర్ కండిషనింగ్ విధానం సంప్రదాయ ఏసీలతో పోలిస్తే తక్కువ విద్యుత్‌తోనే పనిచేస్తుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఏసీలు కంప్రెసర్లు, రసాయనిక రిఫ్రిజరెంట్లపై ఆధారపడడంతో అధిక విద్యుత్ ఖర్చుతో పాటు పర్యావరణానికి కూడా హానికరం. ఈ సమస్యలకు పరిష్కారంగా బిట్స్ పరిశోధకులు ఓపెన్-సైకిల్ థర్మోడైనమిక్ వ్యవస్థ రూపొందించారు. ఇందులో ‘డెసికెంట్ కోటెడ్ హీట్ ఎక్స్చేంజర్’ అనే సాంకేతికతతో గాలిలోని తేమను సమర్థంగా తొలగించే విధానం అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థలో సిలికా జెల్ అనే తేమను పీల్చుకునే పదార్థాన్ని హీట్ ఎక్స్చేంజర్‌పై పూతగా ఉపయోగించారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ ఉష్ణం లేదా తక్కువ ఉష్ణోగ్రత గల పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించి ఈ వ్యవస్థను నడపవచ్చని పరిశోధకులు వెల్లడించారు. తేమ అధికంగా ఉండే ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో ఈ సాంకేతికత ఉపయోగకరమని ప్రొఫెసర్లు గౌస్ అహ్మద్ షేక్, వివేక్ ప్రభాకరన్, సహాయ ప్రొఫెసర్ మృణాల్ కేతన్ జగీర్దార్ పేర్కొన్నారు.