మధుమేహ నియంత్రణలో కీలక ముందడుగు
ABN , Publish Date - May 21 , 2026 | 03:23 AM
మధుమేహ నియంత్రణ, వ్యక్తిగత వైద్యసేవల రంగంలో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు.
ఇన్సులిన్, డోపమైన్‌ను గుర్తించే సూక్ష్మ డ్యూయల్ సెన్సర్‌ను అభివృద్ధి చేసిన బిట్స్ హైదరాబాద్ పరిశోధకులు
బిట్స్‌పిలానీ, మే 20 (ఆంధ్రజ్యోతి): మధుమేహ నియంత్రణ, వ్యక్తిగత వైద్యసేవల రంగంలో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. శరీరంలో ఇన్సులిన్, డోపమైన్ స్థాయులను రియల్‌టైమ్‌లో గుర్తించే సూక్ష్మ డ్యూయల్ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా మధుమేహ బాధితులకు వారి రక్తంలో చక్కెర స్థాయులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా చికిత్స చేస్తారు. అయితే.. వారి ఇన్సులిన్, డోపమైన్ స్థాయులను కూడా తెలుసుకోగలిగితే మరింత సమర్థంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే బిట్స్ హైదరాబాద్ పరిశోధకులు ఈ పోర్టబుల్ సెన్సర్‌ను రూపొందించారు. కార్బన్ క్లాత్‌పై టైటానియం డయాక్సైడ్ నానోఫైబర్ల పూత పూసి తయారుచేసిన ఈ పరికరం అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తుందని వారు తెలిపారు. సంప్రదాయ పరీక్షా విధానాలు భారీ, ఖరీదైన ల్యాబ్ పరికరాలపై ఆధారపడుతున్నాయని.. తాము ఈ సెన్సర్‌ను తక్కువ వ్యయంతో, ఎక్కడికైనా తీసుకెళ్లేవిధంగా రూపొందించామని ఈ పరిశోధనలో పాల్గొన్న రమ్య వెల్లడించారు. ఈ సెన్సర్ ఇన్సులిన్‌ను పికోమోలర్ స్థాయిలో(అంటే లక్ష కోట్లలో ఒక వంతు), డోపమైన్‌ను నానోమోలర్ స్థాయిలో(వెయ్యి కోట్లలో ఒక వంతు) గుర్తించే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని తెలిపారు. దీర్ఘకాల పరీక్షల్లో 99శాతం పైగా పనితీరు స్థిరత్వాన్ని కొనసాగించిందని చెప్పారు. ఈ పరికరాన్ని ఆస్పత్రులతో పాటు ఇంటి వద్ద వినియోగించడానికి వీలుగా లీక్-ప్రూ్‌ఫగా, ఎక్కువ కాలం మన్నేలా రూపొందించినట్లు బృందం తెలిపింది. కాగా.. రియల్‌టైమ్ బయోమెడికల్ మానిటరింగ్, తదుపరి తరం వ్యక్తిగత వైద్య సేవల దిశగా ఇది కీలక ఆవిష్కరణ అని ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ సంకేత్ గోయెల్ పేర్కొన్నారు. ఎలకా్ట్రనిక్స్, బయోసెన్సర్లకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ‘ఐఈఈఈ సెన్సర్స్ జర్నల్’లో ఈ సూక్ష్మ డ్యూయల్ సెన్సర్‌కు సంబంధించిన పరిశోధన పత్రం ప్రచురితమైంది.