Share News

హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:09 AM

ఆసియా ఖండంలోనే అత్యంత కీలకమైన, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌ టెక్నాలజీకి సంబంధించిన బయో ఏషియా-2026 సదస్సు హైదరాబాద్‌లో జరగనుంది.

హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు

  • ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహణ

  • సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభం

  • హాజరుకానున్న పీయూష్‌ గోయల్‌, అశ్వినీ వైష్ణవ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండంలోనే అత్యంత కీలకమైన, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌ టెక్నాలజీకి సంబంధించిన బయో ఏషియా-2026 సదస్సు హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 17, 18వ తేదీల్లో ఈ సదస్సు జరగనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, ఆరోగ్య రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ‘‘టెక్‌బయో అన్‌లీష్డ్‌: ఏఐ, ఆటోమేషన్‌ - బయాలజీ రివల్యూషన్‌’’ ఇతివృత్తంగా సదస్సు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అశ్వినీ వైష్ణవ్‌ హాజరుకానున్నారు. భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు(సైన్స్‌) ప్రొఫెసర్‌ అజయ్‌ కుమార్‌ సూద్‌, డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజీవ్‌ సింగ్‌ రఘువంశీ ఈ సదస్సలో ప్రసంగించనున్నారు. ‘‘ఫార్మా - బయోటెక్‌ భవిష్యత్తు’’ అంశంపై ప్రత్యేక సీఈవో కాన్‌క్లేవ్‌ నిర్వహించనుండగా, అందులో డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌, బయోకాన్‌, సిప్లా వంటి ప్రముఖ భారతీయ సంస్థల సీఈవోలు పాల్గొననున్నారు. అలాగే నోవార్టిస్‌, రోష్‌, నోవో నార్డిస్క్‌, మెడ్‌ట్రానిక్‌, మెర్క్‌, అస్ట్రాజెనెకా వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్యానల్‌ చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది.

Updated Date - Feb 06 , 2026 | 04:09 AM