చికెన్ దుకాణాల బంద్ హెచ్చరిక అన్యాయం
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:14 AM
చికెన్ దుకాణాల బంద్ హెచ్చరిక అన్యాయమని, మార్జిన్ విషయంలో చికెన్ రిటైల్ దుకాణదారులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ది ...
మార్జిన్ విషయంలో రిటైల్ దుకాణదారుల ఆరోపణలు అవాస్తవం
బీఐసీసీ సభ్యుల వివరణ
పంజాగుట్ట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): చికెన్ దుకాణాల బంద్ హెచ్చరిక అన్యాయమని, మార్జిన్ విషయంలో చికెన్ రిటైల్ దుకాణదారులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ది బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ (బీఐసీసీ) సభ్యులు అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు స్నేహ గ్రూప్ చైర్మన్ రాంరెడ్డి, కళింగ బ్రీడింగ్స్ ఎండీ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఆర్ హేచరీస్ ఎండీ తిరుపతిరెడ్డి, ఎస్‌ఎస్ పౌలీ్ట్ర ఎండీ శ్రీనివాస్, వీహెచ్‌ఎల్ జీఎం బాలసుబ్రమణియన్, వెన్‌కాబ్ ఏజీఎం ఎ.రాజిరెడ్డి తదితరులు మాట్లాడారు. ప్రస్తుతం కేజీ చికెన్‌పై రిటైల్ దుకాణాలకు సుమారు రూ. 44 వరకు మార్జిన్ ఇస్తున్నామని తెలిపారు. చికెన్ ధరలు మార్కెట్‌లో పెరిగినా, తగ్గినా రిటైలర్లకు ఇచ్చే మార్జిన్‌లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ప్రతీ కిలోపై రిటైల్ దుకాణదారులకు కనీసం రూ.40 వరకు మార్జిన్ లభిస్తుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చికెన్ దుకాణదారులు బంద్‌కు పిలుపునివ్వడం అన్యాయమన్నారు. రైతులు, కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టి అనేక నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ, రిటైల్ వ్యాపారులు తప్పుడు ఆరోపణలు చేస్తూ బంద్‌కు దిగడం సరైనది కాదన్నారు. ఇంటిగ్రేషన్ కంపెనీలు, రిటైల్ దుకాణదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండదని, హోల్‌సేల్ వ్యాపారుల ద్వారానే సరఫరా జరుగుతోందని తెలిపారు. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు వచ్చినా రిటైల్ వ్యాపారులకు పెద్దగా నష్టం ఉండదని, రైతులు, ఇంటిగ్రేటర్లే తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు.