Share News

డీటీవోను బలిగొన్న బొగ్గు టిప్పర్‌

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:44 AM

అతివేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్‌.. విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీవో) ప్రాణాలను బలిగొంది. సరిగ్గా రవాణా శాఖ కార్యాలయం ఎదుటే ఈ ఘటన చోటు చేసుకోగా..

డీటీవోను బలిగొన్న బొగ్గు టిప్పర్‌

  • విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదం.. టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతి వేగమే కారణం

  • డీటీవో శరీరం ఛిద్రం.. అక్కడికక్కడే మృతి

  • భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్‌ వద్దే ఘటన

  • సీఎం రేవంత్‌ దిగ్ర్భాంతి.. విచారణకు ఆదేశం

  • విచారణాధికారిగా జేటీసీ చంద్రశేఖర్‌ గౌడ్‌

  • ఆ కుటుంబానికి అండగా ఉంటాం: పొన్నం

భూపాలపల్లి/వడ్డెపల్లి/హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అతివేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్‌.. విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీవో) ప్రాణాలను బలిగొంది. సరిగ్గా రవాణా శాఖ కార్యాలయం ఎదుటే ఈ ఘటన చోటు చేసుకోగా.. డీటీవో శరీరం పై నుంచి టిప్పర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. భూపాలపల్లి జిల్లా గణపురం పరిధిలో సోమవారం జరిగిన సంఘటన.. తీవ్ర విషాదాన్ని నింపింది. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా మద్దోజు వెంకన్న (47) ఈనెల 4వ తేదీనే బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా జగిత్యాల నుంచి ఇక్కడికి వచ్చారు. హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయన సోమవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీఏ కార్యాలయానికి కారులో బయల్దేరారు. ఆర్టీవో కార్యాయానికి రెండు కిలో మీటర్ల దూరంలో (మోరంచపల్లి సమీపంలో) ఓ వరి కోత యంత్రం కనిపించగా.. ఆగి పత్రాలను పరిశీలించారు. రోడ్డు పన్ను చెల్లించలేదని గుర్తించి, వరి కోత యంత్రం యజమానిపై కేసు నమోదు చేశారు. హార్వెస్టర్‌ను సీజ్‌ చేసేందుకు ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. ఆర్టీవో కార్యాలయం వద్దకు రాగానే కారు దిగిన డీటీవో వెంకన్న.. వరికోత యంత్రాన్ని లోపలికి పంపించే క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తాడిచర్ల నుంచి భూపాలపల్లిలోని కేటీపీపీకి బొగ్గు తీసుకెళ్తున్న టిప్పర్‌.. అతి వేగంగా వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. ఒడిశాకు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ మహ్మద్‌ తస్లీమ్‌ నిర్లక్ష్యం, అతివేగం వల్ల టిప్పర్‌ అదుపుతప్పి డీటీవో వెంకన్న పై నుంచీ దూసుకెళ్లింది. టిప్పర్‌ ముందు చక్రం వెంకన్న పై నుంచి వెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. దీంతో సంఘటన స్థలంలోనే ఆయన కన్నుమూశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ తస్లీమ్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్పీ సంకీర్త్‌ సందర్శించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ గోదావరిఖనిలోని మార్ల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థకు చెందినదని, ఆ సంస్థ యజమాని మహబూబ్‌ఖాన్‌ అని పోలీసులు గుర్తించారు. కాగా, డీటీవో వెంకన్న స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ బంగ్లా. 2012లో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన 18 రోజులకే ఆయన మరణించడం.. విషాదాన్ని నింపింది. వెంకన్నకు భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.


వెంకన్న మృతిపట్ల సీఎం రేవంత్‌ దిగ్ర్భాంతి

భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి త్రీవ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా జేటీసీ చంద్రశేఖర్‌ గౌడ్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాస్తవాలను తెలుసుకోవడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించాలని పేర్కొంది. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే అధికారుల భద్రత, వాహనాల తనిఖీలు, సీజ్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై సూచనలు చేయాలని ఆదేశించింది. కాగా, డీటీవో వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హనుమకొండలో వెంకన్న భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ వెంకన్న మృతి ఘటనపై ప్రభుత్వం సీరియ్‌సగా ఉందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలపై స్పందిస్తూ.. ఇది శవ రాజకీయాలు చేసే సందర్భం కాదన్నారు. వెంకన్న మృతదేహాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, భూపాలపల్లి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌ తదితరులు సందర్శించి.. నివాళులర్పించారు. డీటీవో వెంకన్న మృతి విషాదకరమని అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్స్‌ అధ్యక్షుడు రవీందర్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jun 23 , 2026 | 02:44 AM