కుట్ర కాదు.. డ్రైవర్ నిర్లక్ష్యమే..!
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:40 AM
భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి మద్దోజు వెంకన్న మృతికి టిప్పర్ డ్రైవర్ మహ్మద్ తస్లీమ్ నిర్లక్ష్యం, రోడ్డు ఇరుకుగా ఉండటమే కారణాలని విచారణాధికారి...
భూపాలపల్లి డీటీవో మృతిపై నిగ్గుతేల్చిన విచారణాధికారి
రేపు రవాణా శాఖ కమిషనర్‌ను ప్రాథమిక నివేదిక
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి మద్దోజు వెంకన్న మృతికి టిప్పర్ డ్రైవర్ మహ్మద్ తస్లీమ్ నిర్లక్ష్యం, రోడ్డు ఇరుకుగా ఉండటమే కారణాలని విచారణాధికారి, విజిలెన్స్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (జేటీసీ) చంద్రశేఖర్ గౌడ్ నిర్ధారించారు. భూపాలపల్లి జిల్లా గణపురం పరిధిలో గత సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో డీటీవో వెంకన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణాధికారిగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. సీసీ కెమెరా ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా డీటీవో మృతికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడమే కారణమని తేల్చారు. సోమవారం ఉదయం డీటీవో వెంకన్న ఘనపురం రోడ్డుపై వెళ్తున్న వరికోత యంత్రాన్ని సీజ్ చేశారు. దానిని ఆర్టీవో కార్యాలయానికి తరలించే ప్రయత్నంలో ఉండగా, అటుగా వచ్చిన బొగ్గులోడు టిప్పర్ అదుపుతప్పి వెంకన్న పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. రవాణా శాఖ అధికారులను చూసిన టిప్పర్ డ్రైవర్.. భయపడి వేగంగా వెళ్లటంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఇది ప్రమాదమేనని, ఘటన వెనుక కుట్ర కోణం లేదని విచారణాధికారి తేల్చారు. ఈ మేరకు ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఇలాంబర్తికి శనివారం ప్రాథమిక నివేదిక అందించనున్నట్లు సమాచారం. కమిషనర్ పరిశీలన తర్వాతనివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు.