ఏడాది గడిచినా అవే సమస్యలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:41 AM
భూ సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు.. గత ఏడాది ఏప్రిల్ 14న అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంతోనైనా.....
భూభారతిపై రైతుల అసంతృప్తి
నేటితో చట్టం అమలుకు ఏడాది
అందుబాటులోకి రాని ట్రైబ్యునల్, వ్యవసాయేతర భూముల ఆర్వోఆర్
పాత భూ సమస్యలకు దరఖాస్తు గడువు నేటితో పూర్తి
ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ
దరఖాస్తు తీసుకోవాలంటున్న నిపుణులు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు.. గత ఏడాది ఏప్రిల్ 14న అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంతోనైనా పరిష్కారం లభిస్తుందని ఆశించారు. కానీ, ఏడాది గడిచినా ఆశలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతిలో భూమి ఉంటే రికార్డులో పేరు ఉండదు.. రికార్డులో పేరు ఉంటే చేతిలో భూమి ఉండదు.. అన్ని హక్కులూ ఉండి, తమ ఆధీనంలో భూమి ఉన్నా.. పాస్ పుస్తకంలో తప్పులు. ఇట్లా రైతులు నానా గోస పడ్డారు. రికార్డుల్లో చోటుచేసుకున్న పొరపాట్లను తొలగించుకొని, తమ భూమి తమదే అని అనిపించుకోవటానికి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగారు. ప్రభుత్వం మారి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. పాత తప్పులను సవరించే కసరత్తు ప్రారంభించారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన సదస్సుల్లో కేవలం కరెక్షన్ (సవరణల) కోసమే 45 వేల దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా తదితర సమస్యలకు సంబంధించి 8 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ, వీటి పరిష్కారంలో తీవ్ర జాప్యం జరగడం, సాంకేతిక ఇబ్బందులతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు.
గడువు పొడిగింపు ఉంటుందా? లేదా?
భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏడాది లోపు గతంలో ఉన్న భూ సమస్యల మీద దరఖాస్తు చేసుకోవచ్చని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది. ఆ గడువు మంగళవారంతో ముగియనుంది. గతంలో రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోలేకపోయినవారు.. ఇప్పటికీ అపరిష్కృత సమస్యలు ఉన్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగిస్తుందా? అనే సందిగ్ధం రైతుల్లో నెలకొంది. దీనిపై భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. మరో ఏడాది పాటు గడువు పొడిగిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతీ సమస్యకు ఒక దరఖాస్తు.. అది కూడా పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారానే సమర్పించాలనే నిబంధనకే పరిమితం కాకుండా.. రైతుకు ఉన్న భూ సమస్యలన్నింటినీ కాగితం మీద రాసి ప్రభుత్వానికి సమర్పించే ఆఫ్‌లైన్ పద్ధతి కూడా తీసుకురావాలని సూచించారు.
అందుబాటులోకి రాని ట్రైబ్యునల్
భూభారతి చట్టం అమలై ఏడాదవుతున్నా.. ట్రైబ్యునల్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. కొత్తచట్టంలో వ్యవసాయేతర భూములకు కూడా ఆర్వోఆర్ హక్కుల రిజిస్టర్ తయారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాల వంటి వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటే ఆ ఆస్తులు ఉన్న వారికి ఆర్థిక భరోసాతోపాటు, రుణ వెసులుబాటు పెరుగుతుందని సునీల్ గుర్తు చేశారు. మరోవైపు, భూభారతి చట్టం గొప్పగా ఉన్నా అమల్లో ఉన్న ఇబ్బందులతో ఆశించిన ఫలితం రాలేదనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ ఉత్తర్వు ప్రకారం.. ఆర్డీవో స్థాయిలో ఉండే భూ సమస్యల్లో 50 శాతం, తహసీల్దార్ స్థాయిలో ఉండే భూ సమస్యల్లో 75 శాతం ఆయా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజలతో సమావేశమై పరిష్కరించాల్సి ఉంటుంది. ఇదే తరహాలో ఇప్పుడు కూడా భూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని ఉంటే.. రెవెన్యూ సదస్సుల ద్వారా వెల్లడైన సమస్యల్లో చాలా వరకు పరిష్కారమై ఉండేవని సునిల్ తెలిపారు. ఈ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.