Share News

రైతులకు రక్షణ కవచం భూభారతి

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:39 AM

రాష్ట్రంలోని రైతులకు భూభారతి చట్టం రక్షణ కవచంలా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో....

రైతులకు రక్షణ కవచం భూభారతి

  • చట్టం అమల్లోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి.. 12 నెలల్లో సందర్శించిన వారు 5.2 కోట్లు

  • పోర్టల్‌లో లాగిన్‌ అయిన వారు 67 లక్షలు

  • ఏడాదిలో 3.80 లక్షల పాస్‌ పుస్తకాల జారీ

  • 5,520 మంది లైసెన్డ్స్‌ సర్వేయర్ల నియామకం

  • భూ భారతిపై సమీక్షలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలోని రైతులకు భూభారతి చట్టం రక్షణ కవచంలా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతిరహిత సేవలే లక్ష్యంగా గత ఏడాది ఏప్రిల్‌ 14న భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. భూ భారతి చట్టానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సచివాలయంలో సోమవారం రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం రాక ముందు, వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులపై చర్చించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామన్న మాటను నిలబెట్టుకునే క్రమంలోనే ఏడాది క్రితం సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్‌ను ఆవిష్కరించామని గుర్తు చేశారు. భూవివాదాలకు చరమగీతం పాడడమే కాకుండా సామాన్యుడు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందిని తగ్గించడంలో ఈ ఏడాది గొప్ప ముందడుగు వేశామని చెప్పారు. పాత చిక్కుముడులను విప్పడంలో భూభారతి పోర్టల్‌ కీలక పాత్ర పోషించిందన్నారు. పోర్టల్‌ ప్రారంభించిన ఏడాదిలోపే 5.20కోట్ల మంది సందర్శించారని, 67 లక్షల మంది లాగిన్‌ అయ్యారని తెలిపారు. ప్రజల కోసం రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. రైతులకు రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించడానికి రెవెన్యూ, సర్వే, రిజిస్ర్టేషన్‌ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీతో కలిసి రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ను ఈనెల 2వ తేదీ నుంచి 5 జిల్లాలోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని తెలిపారు. ఇక్కడ ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మార్పులు, చేర్పులతో వచ్చే నెలలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో ఇంటిగ్రేటెడ్‌ భూభారతిని అమల్లోకి తెస్తామన్నారు.


భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాలకు నక్షాలు లేవని, ఇందులో ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూధార్‌ నంబర్లు ఇచ్చినట్లు చెప్పారు. మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్‌ ద్వారా రీ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో 1948 నాటికి 40 లక్షల సర్వే నంబర్లు వినియోగంలో ఉండగా 77ఏళ్లలో 2.29 కోట్లకు పెరిగాయన్నారు. వీటన్నింటికి భూధార్‌ నంబర్లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. భూ సర్వేకు అవసరమైన సిబ్బందిని నియమిస్తున్నామని, ఇప్పటి వరకు 5,520 మంది లైసెన్డ్స్‌ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 10,984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి జీపీవోలను నియమించామని చెప్పారు. గొలుసులు, కర్రలు, క్రాస్‌స్టాప్‌, మెజరింగ్‌ టేప్‌ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామన్నారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామని, త్వరలో మరో 400 రోవర్లు కొనుగోలు చేయబోతున్నామన్నారు. భూభారతి అమల్లోకి వచ్చాక.. పోర్టల్‌ ద్వారా గత ఏడాది ఏప్రిల్‌ 14 నుంచి ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్‌ పుస్తకాలు జారీ చేసినట్లు వివరించారు.

Updated Date - Apr 14 , 2026 | 04:40 AM