Share News

భూ సంస్కరణలకు స్ఫూర్తి పోచంపల్లి

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:12 AM

భూసంస్కరణల అంశంలో భూదాన్‌ పోచంపల్లి చరిత్ర స్ఫూర్తిదాయకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

భూ సంస్కరణలకు స్ఫూర్తి పోచంపల్లి

  • భూదానోద్యమ వజ్రోత్సవ సభలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేంద్‌రెడ్డి

యాదాద్రి, ఏప్రిల్‌18(ఆంధ్రజ్యోతి): భూసంస్కరణల అంశంలో భూదాన్‌ పోచంపల్లి చరిత్ర స్ఫూర్తిదాయకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. దేశంలో భూమిలేని పేద ప్రజలకు భూ పంపిణీ చేపట్టేందుకు, రాష్ట్రంలో భూ సంస్కరణల చట్టం అమలుకు వినోభాబావే చేపట్టిన భూదానోద్యమానికి, ప్రఽథమదాత వెదిరె రాంచంద్రారెడ్డికి పోచంపల్లి కేంద్రమని గుర్తు చేశారు. భూదాన్‌ వజ్రోత్సవాలను పురస్కరించుకుని సర్వోదయ సమాజ్‌ ట్రస్ట్‌, తెలంగాణ సర్వోదయ మండలి, ప్రఽథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాటు చేసిన వెదిరె రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని గుత్తా సుఖేందర్‌ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ భూదానోద్యమాన్ని వినోభాబావే పోచంపల్లి నుంచే ప్రారంభించారని, వెదిరె రాంచంద్రరెడ్డి 600 ఎకరాల భూదానం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. 48లక్షల ఎకరాలను సేకరించి పేదలకు పంపిణీ చేసిన ఘనత అద్వితీయమన్నారు. నాటి నిజాం కూడా 16వేల ఎకరాలను అందజేశారన్నారు. భూమిలేని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని నాటి ప్రధాని ఇందిరాగాంధీకి స్ఫూర్తినిచ్చి రాష్ట్రంలో ముఖ్యమంతి పీవీ నర్సింహారావు భూసంస్కరణల చట్టం తీసుకురావడానికి దోహదపడిందన్నారు. భూదాన్‌పోచంపల్లి ఖ్యాతి జాతీయస్థాయిలో పెంపొందిందన్నారు. ఇక్కడి వస్త్రాలను జాతీయస్థాయిలో రాష్ట్రపతి, గవర్నర్లు, జాతీయ ప్రముఖులు ప్రశంసిస్తున్నారన్నారు. పోచంపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ భూదానోద్యమం పేదలకు భూదానం చేయడంలో స్ఫూర్తిగా నిలిచి ఎందరో తమతమ భూములను దానం చేయడానికి దోహదపడిందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, సర్వోదయ సమాజ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, వెదిరె రాంచంద్రారెడ్డి మనమడు వెదిరె రాంచంద్రారెడ్డి, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు తొల్పునూరి కృష్ణగౌడ్‌, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి సేవాసమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 06:13 AM