భీంరెడ్డి ఎవరికి బినామీ?
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:43 AM
కర్ణాటకలో కొనుగోలు చేసిన విలువైన 45 ఎకరాల భూముల అంశం డీఎస్పీ భీంరెడ్డి కేసులో ఇప్పుడు ఏసీబీ దర్యాప్తులో కీలకంగా మారింది.
కర్ణాటకలో 45 ఎకరాల భూముల కొనుగోలుకు నిధులెక్కడివి?
నిధుల ప్రవాహంపై ఏసీబీ దర్యాప్తు.. బ్యాంకు ఖాతాల పరిశీలన
రంగంలోకి దిగిన ఈడీ, ఐటీ
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కొనుగోలు చేసిన విలువైన 45 ఎకరాల భూముల అంశం డీఎస్పీ భీంరెడ్డి కేసులో ఇప్పుడు ఏసీబీ దర్యాప్తులో కీలకంగా మారింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని దేవనహళ్లి వద్ద ఒక ఎకరం వాణిజ్య భూమి, బెంగళూరు పరిసరాల్లో మరో ఆరు ఎకరాలు, మంగళూరులో 38 ఎకరాలు భీంరెడ్డి బినామీల పేరిట ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఈ 45 ఎకరాల విలువ రూ.70-80 కోట్లు ఉండవచ్చని అంచనా. మార్కెట్ ధరలు దీనికన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయి. వాటి కొనుగోలుకు అంత భారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కొనుగోలు సమయంలో చెల్లించిన మొత్తం ఏయే బ్యాంకు ఖాతాల నుంచి వెళ్లింది? చెల్లింపులు ఎవరెవరి పేర్ల మీద జరిగాయి? ఈ ఆధారాలే ప్రస్తుతం ఈ కేసులో కీలకమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. విచారణ తొలిదశలోనే ఇవి బినామీ ఆస్తులని గుర్తించిన ఏసీబీ ప్రస్తుతం నిధుల మూలాలపై దృష్టి పెట్టింది. కర్ణాటక భూములు ఎవరి పేరిట ఉన్నాయో వారిని విచారించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కర్ణాటకతోపాటు హైదరాబాద్ పరిసరాల్లో భీంరెడ్డి తన బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులు, వాటి కొనుగోలుకు చేసిన భారీ వ్యయాన్ని గమనిస్తుంటే.. సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుంచి వచ్చిన ఆయన ఈ స్థాయి ఆస్తులు కూడబెట్టడం సాధ్యం కాదని, ఆయన మరెవరికో బినామీ అయి ఉండవచ్చనే అనుమానాలను ఐటీ, ఈడీ, ఏసీబీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ, బినామీ ఆస్తుల చట్టం ప్రకారం ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అరెస్టు తప్పదు!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన భీంరెడ్డి అనారోగ్యం కారణంతో అరెస్టు నుంచి ఉపశమనం పొందినప్పటికి అది తాత్కలికమేనని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఈ కేసులో అతడిని న్యాయస్థానంలో హజరుపరచకుండా చేతులు దులిపేసుకుంటే ఏసీబీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని సీనియర్ పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన తర్వాత భీంరెడ్డి విషయంలో ఏసీబీ యూటర్న్ తీసుకుంటే మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వ ముఖ్యులకు పోలీసు ఉన్నతాధికారులు వివరించినట్లు తెలుస్తోంది. భీంరెడ్డి అరెస్టును అడ్డుకున్న రాజ్యాంగేతర శక్తిపై విచారణ జరపాలని ఇప్పటికే బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీ.. కేవలం దళిత బహుజనులనే కోర్టు ముందు ఉంచుతుందా? భీంరెడ్డి లాంటి వారికి మినహాయింపులా? అని ప్రవీణ్‌కుమార్ లేవనెత్తిన ప్రశ్నలు పోలీసుశాఖలోనూ కలకలం సృష్టిస్తున్నాయి.