Share News

భీమ్‌రెడ్డి జాబితాలో సినీ హీరో! మణికొండలో ఆస్తి విక్రయంపై అగ్రిమెంట్‌..

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:09 AM

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో ఓ సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. కుటుంబ కథాచిత్రాల హీరోగా పేరున్న ఆయన..

భీమ్‌రెడ్డి జాబితాలో సినీ హీరో! మణికొండలో ఆస్తి విక్రయంపై అగ్రిమెంట్‌..

  • రూ.3 కోట్ల అడ్వాన్స్‌ తీసుకున్న హీరో

  • డైరీలో వివరాలు నమోదు చేసిన భీమ్‌రెడ్డి

  • ఏసీబీ దాడితో చిక్కుల్లో పడ్డ ఆస్తి విక్రయం

  • బినామీల విషయంలో భీమ్‌రెడ్డి జాగ్రత్తలు

  • వారి పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. అంతకుముందే క్యాన్సిలేషన్‌ డీడ్‌లు సిద్ధం

  • విచారణలో సహకరించని భీమ్‌రెడ్డి

  • రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించిన ఏసీబీ

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో ఓ సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. కుటుంబ కథాచిత్రాల హీరోగా పేరున్న ఆయన.. మణికొండలోని ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించి భీమ్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దాదాపు రూ.3 కోట్లు అడ్వాన్స్‌ తీసుకున్నారని, మిగిలిన మొత్తం వచ్చే సమయంలో ఏసీబీ దాడి జరగడంతో ఆయన ఆస్తి అమ్మకం వివాదంలో పడిందని సమాచారం. ఆ హీరోకు అందిన రూ.3 కోట్ల వివరాలు భీమ్‌రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలో నమోదైనట్లు తెలిసింది. భీమ్‌రెడ్డి తన డైరీలో.. తనకు ఎవరు ఎంత ఇవ్వాలి, తాను ఎంత మందికి ఎంత మొత్తం ఇవ్వాలి అన్న వివరాలను ఒక పద్ధతిలో రాసుకున్నారన్న విషయాలను ఏసీబీ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ‘మనకు ఇవ్వాల్సిన వాళ్లు’ అనే ఫొటోను, ‘నేను ఇవ్వాల్సినవి’ అని రాసిన ప్రతిని కూడా స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. దాదాపు 60కి పైగా స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను భీమ్‌రెడ్డి ఇంటినుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, భీమ్‌రెడ్డి తన ఆస్తులను బినామీల పేరిట పెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, ఎవరి పేరిట ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారో ఆ బినామీ నుంచి క్యాన్సిలేషన్‌ డీడ్‌ ముందే రాయించి పెట్టుకునేవారని, ఇలాంటి క్యాన్సిలేషన్‌ డీడ్లు భీమ్‌రెడ్డి ఇంట్లో దాదాపు 30కి పైగా దొరికాయని సమాచారం. బినామీలు తిరగబడకుండా ఆయన క్యాన్సిలేషన్‌ డీడ్స్‌ ముందే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.


అరెస్టు ఆలస్యం అందుకే..

ప్రస్తుతం తాను ఉంటున్న విల్లాను ఎలా కొనుగోలు చేశారన్న ప్రశ్నకు భీమ్‌రెడ్డి సమాధానం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో రెండు మెమొరీ కార్డులు, రెండు లాకర్లకు సంబంధించిన వివరాలు, పది బ్యాంకు ఖాతాల వివరాలను గుర్తించామని తెలిపారు. భీమ్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డారని, ఆయన ఇంటి పక్కనే ఉన్న ఎంబీబీఎస్‌ డాక్టర్‌తో ప్రాథమిక చికిత్స చేయించి ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. వైద్యులు భీమ్‌రెడ్డికి బెడ్‌రెస్ట్‌ సూచించారని, ఆయన బీపీ దృష్ట్యా ప్రయాణం చేయవద్దన్నారని, అందుకే ఆయనను అరెస్టు చేయలేదని వివరించారు. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్టు చేశామని తెలిపారు. భీమ్‌రెడ్డి బినామీ ఆస్తుల వివరాలు మరిన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయన్నారు. ఆయన కొనుగోలు చేసిన ఆస్తులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? కార్డు వాల్యూనే కోట్లలో ఉన్నప్పుడు అంత మొత్తాలను ఎలా సమీకరించారు? అనే విషయాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అనేక మంది బినామీలను పెట్టుకున్న భీమ్‌రెడ్డి సైతం కొందరు అధికారులకు బినామీ అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిధుల ప్రవాహంపై ఆధారాలు లభిస్తే గుట్టు బయటపడుతుందని భావిస్తున్నారు.


1000 కోట్ల నిర్మాణాల వెనుక భీమ్‌రెడ్డి..!

మణికొండలో నిరుపేదలకు ఇచ్చిన 60 గజాల ఇంటి స్థలాల్లో వెలిసిన ఆకాశ హర్మ్యాల వెనుక భీమ్‌రెడ్డి, ఆయన బినామీ అయిన ప్రజాప్రతినిధి ప్రముఖ పాత్ర పోషించినట్లుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. మణికొండ మర్రిచెట్టు జంక్షన్‌ వద్ద కొనసాగుతున్న దాదాపు రూ.1000 కోట్ల విలువైన రెండు అక్రమ నిర్మాణాల వెనుక భీమ్‌రెడ్డి ఉన్నారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. భీమ్‌రెడ్డి అండతో సదరు బిల్డర్‌ ప్రీలాంచ్‌ పేరిట ఇప్పటికే దాదాపు రూ.800 కోట్లు వసూలు చేశారని తె లుస్తోంది. రెవెన్యూ శాఖకు సంబంధించిన నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ రెండు వాణిజ్య సముదాయాల నిర్మాణం ఏమాత్రం ఆగలేదని, హెచ్‌ఎండీఏ టౌన్‌ ప్లానింగ్‌ నుంచి సరైన అనుమతులు లేకుండానే అతిపెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారని, ఇందతా భీమ్‌రెడ్డి అండదండలతోనే జరిగిందని తెలుస్తోంది. ఇందులోనే 500 చదరపు అడుగులు భీమ్‌రెడ్డి పేరిట ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 09 , 2026 | 06:22 AM