Yadagirigutta: యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:48 AM
యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహాస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా జె.భవాని శంకర్‌ను ప్రభుత్వం నియమించింది.
విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వెంకటేశ్ దోత్రే
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్/యాదగిరిగుట్ట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహాస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా జె.భవాని శంకర్‌ను ప్రభుత్వం నియమించింది. దాంతో పాటు పలువురు అధికారుల శాఖల్లో మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జీవో జారీ చేశారు. ఇప్పటివరకు యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా ఉన్న ఐఏఎస్ అధికారి వెంకట్రావ్ అనారోగ్య కా రణాలతో ఈ నెల 1న రాజీనామా చేశారు. దీంతో రానున్న వార్షిక బ్రహోత్సవాల విజయవంతంపై అధికారుల్లో నెలకొన్న ఉత్కంఠకు ఈవో నియామకంతో ప్రభుత్వం తెరదించింది. రెండురోజుల్లో గుట్ట ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న భవానీశంకర్ ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న కె.హరితను కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా నియమించగా.. అక్కడ పనిచేస్తున్న వెంకటేశ్ దొత్రేను విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో జాయింట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న కె.నిఖిలను మత్స్యశాఖ సంచాలకురాలిగా నియమించడంతో పాటు తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక పురపాలకశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న వి.సైదాను విద్యాశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.