Share News

‘సర్‌’తో జాగ్రత్త.. లేదంటే పౌరసత్వానికే ఎసరు!

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:15 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌- సర్‌) విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు.

‘సర్‌’తో జాగ్రత్త.. లేదంటే పౌరసత్వానికే ఎసరు!

  • అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే

  • లేకుంటే బిహార్‌, బెంగాల్‌ తరహాలో ప్రమాదం

  • తెలంగాణకు కేసీఆర్‌ కుటుంబమే ప్రమాదకరం

  • ఖమ్మం జిల్లా వైరాలో డిప్యూటీ సీఎం భట్టి

వైరా, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌- సర్‌) విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. అజాగ్రత్తగా ఉంటే పౌరసత్వానికే ఎసరు వస్తుందని హెచ్చరించారు. బిహార్‌, బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలోనూ సర్‌తో ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అందుకే ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందా్‌సనాయక్‌ అధ్యక్షతన బీఎల్‌ఏలు, కార్యకర్తలకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా నమోదు, సవరణలు, మ్యాపింగ్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బిహార్‌, పశ్చిమబెంగాల్‌ లాంటి రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గంలో 30-40 వేల ఓట్లను తొలగించడంతో అక్కడ అభ్యర్థుల తలరాతలు తారుమారయ్యాయని గుర్తుచేశారు. సర్‌తో తన ఓటును కూడా కోల్పోయే ప్రమాదం లేకపోలేదని భట్టి అన్నారు. 2002లోని ఓటర్‌ లిస్టులో మల్లు భట్టి విక్రమార్క అని, 2025 లిస్టులో విక్రమార్క మల్లు అని ఉంటే దాన్ని ఆసరా చేసుకొని తన ఓటును తొలగించే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల మ్యాపింగ్‌ చేసిన ఓటర్లు కూడా తుది జాబితా వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ కుటుంబమే అత్యంత ప్రమాదకరమని భట్టి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు గాలివార్తలతో ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ రాష్ట్రంమీద పడి తిరుగుతున్నారని భట్టి ధ్వజమెత్తారు.

రూ.9 వేల కోట్ల భరోసా నిధులు: తుమ్మల

ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. డిప్యూటీ సీఎం చొరవతో చింతకాని మండలంలో రైతు ఆశీర్వాద సభ జరుగుతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా వానాకాలం రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లను విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. దేశం మొత్తంమీద కేంద్రం 70 లక్షల టన్నుల పంటలను కొనుగోలు చేస్తే ఒక్క తెలంగాణ నుంచి కొనుగోలు చేసిన పంటలే 55 లక్షల టన్నులని వివరించారు.

Updated Date - Jun 25 , 2026 | 04:15 AM