Share News

రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలు కాపాడండి

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:02 AM

జీఎస్టీ సంస్కరణలతోపాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించడంతోపాటు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్‌ విధానం కొనసాగాలని సూచించారు.

రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలు కాపాడండి
BATTI

  • ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసే వారిపై చర్యలుండాలి

  • నిజాయితీ కలిగిన పన్నుదారులకు అనవసర నోటీసులు వద్దు

  • దేశ వ్యాప్తంగా స్క్రాప్ రంగంలో పన్ను ఎగవేతను అరికట్టాలి

  • హైదరాబాద్‌లో జీఎస్టీఎన్‌, జీఎస్టీ కౌన్సిల్‌ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

  • 57వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ సంస్కరణలతోపాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించడంతోపాటు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్‌ విధానం కొనసాగాలని సూచించారు. గురువారం ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. జీఎస్టీ అమలుకు పునాది పరస్పర విశ్వాసమేనన్నారు. ఉమ్మడి జాతీయ మార్కెట్‌ ఏర్పాటుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న నమ్మకంతో రాష్ట్రాలు తమ స్వతంత్ర పన్నుల అధికారంలో భాగాన్ని వదులుకున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35 శాతంగా ఉందని, ఈ ఆదాయమే పాఠశాలలు, ఆస్పత్రులు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరుస్తోందని వివరించారు. అయితే మోటారు వాహనాల రీఫండ్‌లు, విధానాల మార్పుల వల్ల రాష్ట్రానికి ఏడాదికి రూ.800 కోట్ల కంటే ఎక్కువ ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. కేంద్రం దీనిపై పూర్తి ఆర్థిక ప్రభావాన్ని వివరించాలని కోరారు. ఆటోమేటిక్‌ రిజిస్ట్రేషన్లు, పెనాల్టీల హేతుబద్ధీకరణ వంటి సంస్కరణల్ని స్వాగతిస్తూనే.. నిజాయితీ కలిగిన పన్నుదారులకు అనవసర నోటీసులు రాకుండా చూడాలని సూచించారు.


జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలి..

పన్నుదారులకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తూనే.. నకిలీ రిజిస్ట్రేషన్లు, ఇన్వాయి్‌సల సృష్టి, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ దుర్వినియోగంపై జీరో టాలరెన్స్‌ విధానంతో ఉక్కుపాదం మోపాలని భట్టివిక్రమార్క డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా స్ర్కాప్‌ రంగంలో జరుగుతున్న పన్ను ఎగవేతను అరికట్టాలని, అదే సమయంలో చెత్త సేకరించే కార్మికులు, చిన్న స్థాయి సేకరణదారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక కార్యాచరణ కోసం జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఎగుమతి రాష్ట్రాల సహకారాన్ని గుర్తించి తగిన ప్రోత్సాహకాలు అందించాలని, హెల్త్‌, నేషనల్‌ సెక్యూరిటీ సెస్‌లలో రాష్ట్రాలకు పారదర్శక వాటా కల్పించాలని కోరారు. అత్యంత చురుకైన పన్ను ఆధారాల్లో ఒకటైన తెలంగాణకు అధికారుల కమిటీల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, జీఎస్టీ కౌన్సిల్‌ పునర్‌వ్యవస్థీకరించే కమిటీలు, స్టాండింగ్‌ కమిటీ ఆఫ్‌ ఆఫీసర్స్‌లో చోటివ్వాలని విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌, ఏఐ రంగాల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌లో జీఎస్టీఎన్‌, జీఎస్టీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌కు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Oct 09 , 2026 | 05:02 AM