Share News

సింగరేణిపై బీఆర్‌ఎస్‌ కుట్ర

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:40 AM

సింగరేణి సంస్థపై ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోందని..

సింగరేణిపై బీఆర్‌ఎస్‌ కుట్ర

  • కోయగూడెం, సత్తుపల్లి-3 బ్లాకులు ప్రైవేటుకు

  • వాళ్ల నుంచి బొగ్గు కొనేలా దుర్మార్గపు ఆలోచన

  • మేం చేసిన అప్పు 1.77 లక్షల కోట్లు.. చెల్లించింది 2.08 లక్షల కోట్లు: భట్టి

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థపై ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోందని, కానీ, ఒక్క కిలో కూడా మాయం కాలేదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థకు బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క కోల్‌ బ్లాక్‌నైనా తెచ్చారా అని నిలదీశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను విస్తరించారు. వాటికి అవసరమైన బొగ్గు బ్లాకులను ఎందుకు సమకూర్చలేదు? కేంద్రం వేలం వేసిన కోల్‌ బ్లాకు టెండర్లలో పాల్గొని, సింగరేణికి ఆ గనులు దక్కేలా ఎందుకు చూడలేదు!? సింగరేణికి కోల్‌ బ్లాకులు వస్తే రాయల్టీ రూపంలో వచ్చే ఆదాయం తెలంగాణకే చెందేది కదా!?’’ అని ప్రశ్నించారు. కొత్త గనులు తేకుండా, వేలంలో పాల్గొనకుండా.. రాష్ట్రంలో బొగ్గు కొరత సృష్టించి, సంస్థను సంక్షోభంలోకి నెట్టేయడమే మీ ఉద్దేశమా అని నిలదీశారు. కోయగూడెం, సత్తుపల్లి-3 బొగ్గు బ్లాకులను సింగరేణికి దక్కకుండా చేసింది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని, వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో కేసీఆర్‌ సర్కారు పాత్ర ఉందని ఆరోపించారు. దాదాపు 65 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్న సత్తుపల్లి-3 బ్లాకును ప్రైవేటువారికి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. సింగరేణిని ఆర్థికంగా దెబ్బ తీసి, థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులకు బొగ్గు కొరత సృష్టించి, ప్రైవేటు వ్యక్తుల నుంచి బొగ్గును కొనుగోలు చేయాలన్నదే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన అని ఆరోపించారు. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు మాయమైందన్న అంశంపై విచారణ చేయాల్సిందిగా సింగరేణి విజిలెన్స్‌ డైరెక్టర్‌కు ఆదేశాలిస్తున్నానని తెలిపారు. ఆయన సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు.


రాష్ట్రాన్ని నాశనం చేసిందే కేసీఆర్‌

‘‘బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడీకి ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఆయన స్థాయి కాదని, బయటకు రారని హరీశ్‌రావు, కేటీఆర్‌ అంటున్నారు. స్థాయి అనేది పుట్టుకతో రాదు. పోషించే పాత్రతో వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా నేను అసెంబ్లీకి రాలేదా? కేసీఆర్‌కు సవాలు విసురుతున్నా. మీరు చేసిన అప్పులు వాస్తవం కాదా? రాష్ట్రాన్ని తాకట్టు పెట్టలేదా?’’ అని డిప్యూటీ సీఎం భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన అప్పులను హరీశ్‌, కేటీఆర్‌ తక్కువ చేసి చూపుతున్నారని, అబద్ధాలు పోగేసి, స్థాయిని దిగజార్చుకుని, అదే పనిగా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలు దోపిడీతో వార్తా సంస్థలు పెట్టుకుని, సోషల్‌ మీడియా ద్వారా దాడి చేస్తున్నారని విమర్శించారు. ‘‘రాష్ట్రాన్ని నాశనం చేసిందే కేసీఆర్‌. ఆయన మళ్లీ పాలిస్తారని అంటున్నారు. 2014 నుంచి 2023 డిసెంబరు 1 వరకు రూ.8,21,651 కోట్ల అప్పు చేశారు. ఇది రాష్ట్ర అప్పు కాదా? కేసీఆర్‌ చెల్లిస్తారా?’’ అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులకు ఈ రెండున్నరేళ్లలో వడ్డీలు, అసలు కింద రూ.2,08,681 కోట్లను చెల్లించామన్నారు. ‘‘వాళ్లు 10, 10.5 శాతం వడ్డీతో అప్పులు తెచ్చారు. మేం వాటిని రీ స్ట్రక్చర్‌ చేయించి భారం తగ్గించాం. అసలు, వడ్డీ కింద 2025-26 నుంచి 2031-32 మధ్యకాలంలో రూ.34,058 కోట్లు చెల్లించాలి. దానిని రూ.11,915 కోట్లకు తగ్గించాం. తద్వారా రాష్ట్రానికి రూ.22,142 కోట్లు ఆదా అయింది. అంతేనా, ఈ రెండున్నరేళ్లలో మేం రూ.1.77 లక్షల కోట్ల అప్పు తెచ్చాం. కానీ, రూ.2,08,681 కోట్లు తిరిగి చెల్లించాం’’ అని వివరించారు. హాస్టళ్ల విద్యార్థులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని హరీశ్‌రావు, కేటీఆర్‌ రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


మెస్‌ చార్జీలను తాము 200 శాతం పెంచి, క్రమం తప్పకుండా అందిస్తున్నామన్నారు. విద్యార్థుల దుస్తుల టెండర్లలో రూ.2000 కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారని, నిజానికి టెండర్ల మొత్తం విలువే రూ.1,142 కోట్లని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ... సంక్షేమ శాఖల్లో టెండర్లపై తాము గన్‌ పార్క్‌ వద్ద వేచి ఉన్నామని, కానీ... చర్చకు వస్తామన్న హరీశ్‌రావు రాలేదని తెలిపారు. పైగా... ఆయనను అరెస్టు చేయించానని ఆరోపిస్తున్నారని, తాను అంత పిరికివాడిని కాదని, అరెస్టు చేయించి, వెనక్కి తగ్గే మనస్తత్వం కాదని అన్నారు. ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని అంటున్నారని, కానీ... తాము అప్పటికే గన్‌ పార్కు వద్ద మాట్లాడుతున్నామని తెలిపారు. విద్యార్థుల దుస్తుల టెండర్ల మొత్తం రూ.1,142 కోట్లు ఉంటే... అందులో రూ.2000 కోట్ల అవినీతి జరిగిందనడంలో అర్థం ఉందా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Updated Date - Jul 04 , 2026 | 05:40 AM