ధాన్యం, మక్కలను ఎఫ్‌సీఐనే కొనాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:23 AM
రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, మక్కలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కొనాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
బీజేపీ నేతలు ఎందుకు పట్టించుకోవట్లేదు
బీఆర్‌ఎస్ పాలనలో డిస్కమ్‌లు అప్పుల పాలు
ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు : డిప్యూటీ సీఎం భట్టి
జనగామ, భువనగిరి జిల్లాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
జనగామ/యాదాద్రి/చిలుపూర్/స్టేషన్‌ఘన్‌పూర్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, మక్కలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కొనాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రైతుల కల్లాల్లోకి వెళ్లి కన్నీళ్లు తుడుస్తామని చెబుతున్న బీజేపీ నేతలు.. ఎఫ్‌సీఐతో ధాన్యం, మక్కలను ఎందుకు కొనిపించడం లేదని ప్రశ్నించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట, భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం వంకమామిడి, వలిగొండ మండలం నర్సాపూర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే, భువనగిరిలో విద్యుత్ సర్కిల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని, తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరతో కొంటున్నామన్నారు. గతంలో రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేదని, ఇప్పుడు ఎందుకు కొనడం లేదని నిలదీశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు డిస్కమ్‌లకు బిల్లులు చెల్లించకుండా అప్పుల పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్కమ్‌లకు ప్రతి నెలా వేల కోట్లు చెల్లిస్తున్నామన్నారు. వార్తల్లో ఉండాలన్న ఉద్దేశంతో హరీశ్‌రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వనరులను దోచుకొని ఖజానాను ఖాళీ చేసి ఇచ్చారని విమర్శించారు. 8 లక్షల కోట్ల అప్పులకు ఏటా రూ.74వేల కోట్ల అసలు, వడ్డీ వాయిదాలను చెల్లిస్తూనే, రాష్ట్రంలో ఎలాంటి పన్నులు పెంచకుండానే.. పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చే రాబడిలో ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ముందకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలోని పేద వారు ఇక్కడ పుట్టడం తమ అదృష్టంగా భావించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని 1.15కోట్ల కుటుంబాలకు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం అమలులో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంటామన్నారు. భువనగిరి పరిసరాల్లో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బస్వాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, ఆర్‌అండ్ ప్యాకేజీ నిధులు విడుదల చేస్తామన్నారు.
‘స్టేషన్’కు 7 సబ్ స్టేషన్లు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
దేవాదుల ప్రాజెక్టుతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో వలసలు ఆగిపోయాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. 1994లో తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో సాగునీరు లేక ఇక్కడి రైతులు వలసలు వెళ్లేవారని గుర్తు చేశారు. దేవాదులతో ఈ ప్రాంతం జలకళ సంతరించుకుందని, తద్వారా రైతులు అత్యధికంగా పంటలు సాగు చేస్తున్నారని వివరించారు. నియోజకవర్గంలో 7 సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం 60.62 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.