Share News

ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్‌ బకాయిలు రాబట్టుకోండి

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:04 AM

రానున్న రోజుల్లో విద్యుత్‌ రంగానికి ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు.

ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్‌ బకాయిలు రాబట్టుకోండి

  • కరెంటు సరఫరాలో అంతరాయం రాకుండా చూసుకోండి పవర్‌ అంబులెన్స్‌ సేవలను రాష్ట్రమంతటా విస్తరించాలి

  • ఫ్లై ఓవర్ల కింద సబ్‌స్టేషన్ల ఏర్పాటును పరిశీలించండి

  • సింగరేణి కొత్త బ్లాక్‌లను సాధించాలి.. ఉత్పత్తి పెంచాలి

  • అధికారులతో సమీక్షలో భట్టి

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో విద్యుత్‌ రంగానికి ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా అధికారులు ముందుచూపుతో వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున.. భవిష్యత్తులో పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం రాకుండా, ప్రజలకు నాణ్యమైన కరెంటు అందించేందుకు పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్‌ సుల్తానియాతో కలిసి ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలకు ఆటంకం కలగకుండా విద్యుత్‌ను అందించాలన్నారు. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని, రెవెన్యూ వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేసి సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించాలని అన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు దశలవారీగా సోలార్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించాలన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో అభివృద్థి చేసిన మోడల్‌ సబ్‌స్టేషన్‌ను ఆదర్శంగా తీసుకుని, దక్షిణ డిస్కమ్‌ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లను దశలవారీగా ఆధునికీకరించాలని సూచించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భూమి కొరత దృష్ట్యా ఫ్లైఓవర్ల కింద సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు మునిసిపల్‌ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.


పవర్‌ అంబులెన్స్‌ సేవలు విస్తరించాలి..

108 తరహాలో ప్రారంభించిన ‘పవర్‌ అంబులెన్స్‌’ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 21 సర్కిళ్ల పరిధిలో 168కి పైగా వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయడం, ఎర్రగడ్డలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా వేగవంతమైన సేవలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దక్షిణ డిస్కమ్‌ సీఎండీ జితేశ్‌ వి.పాటిల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా గత 30 నెలలుగా చేపట్టిన ప్రగతి కార్యక్రమాలు, తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో డీటీఆర్‌ మ్యాపింగ్‌ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ఏఐ ఆధారిత సాంకేతికతను విద్యుత్‌ శాఖలో విస్తృతంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాక్‌లను సాధించి, తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల మైనింగ్‌ లీజు లభించిన తాడిచర్ల-2 బ్లాక్‌కు సంబంధించి నిర్ణీత కాలపరిమితిలో అన్ని అనుమతులు సాధించి, యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.

Updated Date - Jul 19 , 2026 | 06:05 AM