Share News

మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:29 AM

రాష్ట్రంలోని మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మైనారిటీల సంక్షేమానికి  కట్టుబడి ఉన్నాం

  • మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణం

  • మైనారిటీ సంక్షేమంపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించామని, వాటికి సంబంధించిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని తెలిపారు. మైనారిటీల సంక్షేమంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌, మైనారిటీ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భట్టి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను అన్ని రకాల ఆధునిక హంగులు, వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. మైనారిటీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా వారికి ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. క్రిస్టియన్‌ మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో శ్మశానవాటికలకు స్థలాలను కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఉర్దూ అకాడమీ గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ సంస్కృతిని ప్రతిబింబించేలా ‘ముషాయిరా (కవి సమ్మేళనాలు)’లను నిర్వహించనున్నట్లు భట్టి వెల్లడించారు. మొహరం సందర్భంగా... 9వ రోజున నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఈ సందర్భంగా భట్టి ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ ఆహ్వానించారు.

Updated Date - Jun 19 , 2026 | 03:29 AM