Share News

రాహుల్‌ ప్రధాని అయితేనే.. సామాజిక రుగ్మతల నిర్మూలన

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:40 AM

రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని సామాజిక రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధాన మంత్రిగా చేసే వరకూ రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు నిరంతరం పని చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

రాహుల్‌ ప్రధాని అయితేనే.. సామాజిక రుగ్మతల నిర్మూలన

  • కాంగ్రెస్‌తోనే విప్లవాత్మక మార్పులు

  • మా పార్టీని కనుమరుగు చేయాలని బీజేపీ కుట్ర: భట్టి విక్రమార్క

వికారాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని సామాజిక రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధాన మంత్రిగా చేసే వరకూ రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు నిరంతరం పని చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా డీసీసీ అధ్యక్షులు కృషి చేయాలన్నారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి సోమవారం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘‘కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్‌ వాదిగా కుల వివక్ష నిర్మూలనకు ఎలా పోరాటం చేయాలి’’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలో అంటరానితనం, వివక్ష ఎక్కడ ఎదురైతే అక్కడ రాహుల్‌గాంధీ ప్రత్యక్షమవుతారన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో వేముల రోహిత్‌ కుల వివక్షను భరించలేక బలవన్మరణానికి పాల్పడితే.. రాహుల్‌గాంధీ నేరుగా వర్సిటీకి చేరుకుని విద్యార్థులతో చర్చించి పోరాటం చేశారని చెప్పారు. దేశంలో విప్లవాత్మక చట్టాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. స్వాతంత్య్రం ముందు నుంచి దేశంలోని సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ఉద్యమిస్తున్న కాంగ్రె్‌సను దేశంలో లేకుండా చేసేందుకు కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ చేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ అంటోందని అన్నారు. కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవమని, తానూ కుల వివక్ష ఎదుర్కొన్నానని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీడబ్ల్యూ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 05:40 AM