సౌర విద్యుత్‌కు ప్రోత్సాహం
ABN , Publish Date - May 29 , 2026 | 04:07 AM
రాష్ట్రంలో సౌర విద్యుత్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సాహం అందించడంతో పాటు రాష్ట్రాన్ని ‘గ్రీన్ ఎనర్జీ హబ్’గా మార్చేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ
కల్లాల వద్దకు వచ్చి కట్టుకథలు చెప్పే బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలను నిలదీయండి
డిప్యూటీ సీఎం భట్టి.. బోనకల్, గార్లపాడులో 2 సోలార్ యూనిట్లు ప్రారంభం
బోనకల్/ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి), మే 28: రాష్ట్రంలో సౌర విద్యుత్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సాహం అందించడంతో పాటు రాష్ట్రాన్ని ‘గ్రీన్ ఎనర్జీ హబ్’గా మార్చేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిన్నబీవరల్లిలో ఓ ఇంటిపైన సోలార్ ప్యానల్‌ను, గార్లపాడులో ఓ పొలంలో సోలార్ పంపుసెట్‌ను ఆయన ప్రారంభించారు. ‘సోలార్ మోడల్ విలేజ్’లో భాగంగా వాటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడుతూ సోలార్ రూఫ్‌టాప్, పంపుసెట్లతో కరెంటు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపి అదనపు ఆదాయం పొందవచ్చని, ముందుకొచ్చినవారికి అందిస్తామని చెప్పారు. రెడ్కో సంస్థ రూపొందించిన ప్రత్యేక సోలార్ ప్యానళ్లను రైతులు షెడ్లుగా ఉపయోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగినా కొరత లేకుండా చూడగలిగామన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడం వల్ల పెద్దఎత్తున ధాన్యం, మొక్కజొన్నతో పాటు అన్ని పంటల దిగుబడి పెరిగిందని చెప్పారు. ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోలుకు కేంద్రం కొర్రీలు, ఆంక్షలు పెడుతోందని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలను కొంటుంటే బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ స్వార్థం కోసం కల్లాల వద్దకు వచ్చి కట్టుకథలు చెబుతున్నారని భట్టి మండిపడ్డారు. అలాంటి వారిని రైతులు నిలదీయాలన్నారు. యాసంగిలో 51.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటికే 57 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. ఈనెలాఖరుకు 75లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కొనుగోలు చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేస్తోందని చెప్పారు. మొక్కజొన్న కొనుగోలుకు ఆర్థిక శాఖ నుంచి రూ.5 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటున్నామని చెప్పారు.