పీపుల్స్ మార్చ్.. ఓ మహాయజ్ఞం: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:48 AM
రాష్ట్ర రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తన జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తన జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆ పాదయాత్ర ప్రారంభమై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం, ప్రజల సమస్యలను కళ్లారా చూడాలనే తపనతో మార్చి 16, 2023న ఆదిలాబాద్ అడవుల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఖమ్మం గడ్డ వరకు 1364 కిలోమీటర్ల మేర సాగిందని గుర్తు చేశారు. పాదయాత్రలో ప్రజలు చూపిన ఆత్మీయత, తల్లులు పెట్టిన గోరుముద్దలు, రైతన్నల కరచాలనం తనను ముందుకు నడిపించాయన్నారు. నాడు పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి తన డైరీలో రాసుకున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే ఈ ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.