నియోజకవర్గాల పునర్విభజనలో సామాజిక న్యాయం జరగాలి
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:20 AM
కేంద్రప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా లెక్కల ప్రకారం కాకుండా, కులాలవారీగా, సామాజిక న్యాయం జరిగేలా చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.
జనాభా ప్రాతిపాదికన జరిగితే దక్షిణాదికి అన్యాయం.. ఫూలే జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి
రవీంద్రభారతి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనను కేవలం జనాభా లెక్కల ప్రకారం కాకుండా, కులాలవారీగా, సామాజిక న్యాయం జరిగేలా చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే దక్షినాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. రవీంద్రభారతిలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మహాత్మా జ్యోతిరావు ఫూలే 199 జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలు సామాజిక మార్పు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని, వాటిని బలహీనపరిచేందుకు కేంద్రం ఆయా రాష్ట్రాల వాటాలో కోత విధిస్తోందని విమర్శించారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి రూ.1 వెళ్తే.. 37 పైసలు మాత్రమే తిరగొస్తున్నాయని తెలిపారు. ఈ వివక్షపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామన్నారు. దేశంలో బ్రిటీష్ పాలన తర్వాత కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించకుండా తొక్కిపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తులు మళ్లీ ఏకం కావాలని చూస్తున్నాయని బహుజనులు తమ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. ఫూలే ఆశయాల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. చదువు ఒక్కటే బడుగు బలహీన వర్గాల తలరాతలను మార్చగలదన్నారు. కులం అనే సామాజిక వివక్షను సమాజం నుంచి కూకటివేళ్లతో సహా తొలగించాలని పిలుపునిచ్చారు. మహాత్మా ఫూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ బండ ప్రకాశ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివా్‌సగౌడ్, గుజ్జ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ
రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యకర్తలకు సత్కారాలు జరుగుతున్న సమయంలో బీసీ సంఘాల నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తోసుకుంటూ కొట్లాడుకునే వరకు వెళ్లారు. వేడుకలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు, కార్యకర్తలకు అవార్డులు, సన్మానాల విషయంలో మేకపోతుల నరేం ద్ర, జాజుల శ్రీనివా్‌సగౌడ్‌కు చెందిన వర్గాల మధ్య వివా దం చోటుచేసుకుంది. కార్యకర్తలకు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివా్‌సగౌడ్, మేకపోతుల నరేంద్ర నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల ను బయటకు పంపడంతో గొడవ సద్దుమణిగింది.
సమ సమాజ స్థాపకుడు పూలే: కేసీఆర్
వర్ణ వివక్షకు వ్యతిరేకం గా పోరాడిన గొప్ప సామా జిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపకుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఫూలేకు రేవంత్ నివాళులు
మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. శనివారం ఢిల్లీలోని నివాసంలో ఎంపీ మల్లు రవితో కలిసి సీఎం పుష్పాంజలి ఘటించారు. అణగారినవర్గాల సామాజిక న్యాయం, మహిళా విద్య కోసం పూలే చేసిన విశేష కృషి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణలో సమగ్ర కుల గణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వంటి పలు నిర్ణయాలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు.