Share News

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర సంపద

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:26 AM

మన విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా, సంపదగా ప్రభుత్వం భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర సంపద

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

  • కేజీబీవీ బాలికల మధ్య పుట్టినరోజు

  • విద్యార్థినులతో కలిసి భోజనం

  • ప్రజా భవన్‌లోనూ ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు

మొయినాబాద్‌/హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మన విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా, సంపదగా ప్రభుత్వం భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం తన పుట్టినరోజును రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని నజీబ్‌నగర్‌ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి జరుపుకొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్‌ చదువుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలల పిల్లలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన యూనిఫామ్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో డైట్‌ చార్జీలు పెంచకపోవడం వల్ల విద్యార్థులు పౌష్ఠికాహార లోపంతో ఇబ్బంది పడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం 40శాతం డైట్‌ చార్జీలు 200శాతం కాస్మోటిక్‌ చార్జీలను పెంచిందన్నారు.

నిరాడంబరతకు నిదర్శనం

హంగూ ఆర్భాటాలకు పోకుండా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న పేద బాలికల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం భట్టి నిరాడంబరతకు నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాలకు సంబంధించి పెండింగ్‌లో పెట్టిన డైట్‌, కాస్మోటిక్‌ బిల్లులను ప్రజా ప్రభుత్వం గ్రీన్‌ చానల్‌ ద్వారా వెనువెంటనే విడుదల చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ డైట్‌, కాస్మోటిక్‌ చార్జీలను భారీగా పెంచినందుకు ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందించడంపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.


ప్రజాభవన్‌లో భట్టి జన్మదిన వేడుకలు

భట్టి జన్మదిన వేడుకలు సోమవారం ప్రజాభవన్‌లో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా.. భట్టి విక్రమార్కకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ‘తెలంగాణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంలో కలిసికట్టుగా కృషి చేద్దాం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. విక్రమార్కకు భగవంతుడు దీర్ఘాయుష్సును ప్రసాదించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. భట్టికి మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు, తుమ్మల, సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. భట్టి పుట్టిన రోజును పురస్కరించుకుని కాంగ్రెస్‌ శ్రేణులు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

Updated Date - Jun 16 , 2026 | 05:26 AM