భారతి బిల్డర్స్‌కు భారీ జరిమానా
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:57 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని ‘భారతి లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్స్’ ప్రాజెక్టులో చట్టవ్యతిరేక ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో డబ్బు వసూలు చేసిన భారతి బిల్డర్స్ సంస్థకు తెలంగాణ రెరా షాక్ ఇచ్చింది.
రూ.4.74 కోట్ల ఫెనాల్టీ విధిస్తూ రెరా నిర్ణయం
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని ‘భారతి లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్స్’ ప్రాజెక్టులో చట్టవ్యతిరేక ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో డబ్బు వసూలు చేసిన భారతి బిల్డర్స్ సంస్థకు తెలంగాణ రెరా షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు ఏకంగా రూ.4,74,17,729 జరిమానా విధిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పలు నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ సంస్థను డీఫాల్టర్ ప్రమోటర్‌గా ప్రకటిస్తూ.. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన నగదును 60 రోజుల్లోగా వాపసు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2021లో ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీ మొత్తంలో నిధులు వసూలు చేశారని ఫిర్యాదులపై కమిటీ విచారణ జరిపింది. 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఆ సంస్థ విఫలమయిందని, కనీస చట్టబద్ధమైన అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా నిధులు సేకరించడం, ఎటువంటి నిర్మాణపనులు చేపట్టకపోవడంపై అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రూల్స్-2017(రూల్-15) ప్రకారం వడ్డీతో సహా 60 రోజుల్లో వినియోగదారులకు డబ్బులు వాపసు ఇవ్వాలని నిర్దేశించింది.