భద్రాద్రిలో కళావాహన, జీర్ణోద్ధరణకు అనుజ్ఞ
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:36 AM
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తొలి విడతలో...
దేవతామూర్తులు బాలాలయానికి తరలింపు
పుష్కరాలకు ఆలయం సిద్ధం కావాలి
మరొకరి సంప్రదాయాన్ని వేలెత్తి చూపొద్దు
చినజీయర్ స్వామి వ్యాఖ్యలు
భద్రాచలం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తొలి విడతలో రూ.351 కోట్లతో రామాలయ విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. మరోవైపు ఆలయంలో చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో కళావాహన, జీర్ణోద్ధరణ అనుజ్ఞ కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో సంప్రదాయంగా నిర్వహించారు. ఆయన సమక్షంలోనే ఉత్సవానుజ్ఞ తీసుకున్నారు. ఈ క్రమంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కళావాహన హోమాలు నిర్వహించారు. కలశాలలో 72 దేవతామూర్తులను ఆవాహన చేసి రంగనాయకులగుట్టపై ఉన్న ధ్యానమందిరంలోని బాలాలయానికి తరలించారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారు, గోదాదేవి అమ్మవారు(ఆండాళ్లమ్మవార్లను) అంతరాలయంలోకి తరలించారు. సోమవారం నుంచి కలశాల వద్ద పారాయణం, ఆరాధన కార్యక్రమాలను వైదిక సిబ్బంది నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి మాట్లాడుతూ.. భద్రాద్రిలో ప్రభుత్వం రామాలయ అభివృద్ధికి ధనాన్ని సమకూర్చడంతో సుందరంగా, భవ్యంగా అభివృద్ధి చెందనుందని, భక్తులకు కూడా సదుపాయాలు, సౌకర్యాలు మెరుగవుతాయని చెప్పారు. ఆలయంలో అభివృద్ధి పనులు పుష్కరాల సమయం నాటికి పూర్తి కావాలని ఆకాంక్షించారు. భద్రాచలంలో భక్తరామదాసు ఆలయాల సంప్రదాయం, స్వరూపంతో కూడిన మంచి వ్యవస్థను ఏర్పా టు చేశారని అన్నారు. ఎవరి సంప్రదాయం వారిదని, మరొకరి సంప్రదాయాన్ని వేలెత్తి చూపడం పద్ధతి కానే కాదన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, దేవస్థానం ఈవో కె.దామోదర్‌రావు, తహసీల్దార్ దనియాల వెంకటేశ్వర్లు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, అర్చకులు పాల్గొన్నారు.