రోడ్డు ప్రమాదంలో కుటుంబం బలి
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:43 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాణాలు కోల్పోయిన భార్యాభర్త, కుమారుడు
మృతదేహాలను ఇంటికి తేవద్దన్న యజమాని
ములకలపల్లి/భద్రాచలం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదారం అటవీ ప్రాంతం వద్ద కారు చెట్టును బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో భద్రాచలానికి చెందిన సాయి(25), ఆయన భార్య సంధ్య(23), కుమారుడు మోక్షిత్(4) అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి జ్యోతి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమెను పాల్వంచ వైద్యశాలకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఐదు నెలల క్రితం సాయి తండ్రి శ్రీనివాసరావు(ట్రాన్స్‌కో లైన్ ఇన్‌స్పెక్టర్) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం నాటి ప్రమాదంలో శ్రీనివాసరావు కుమారుడు, కోడలు, మనవడు ప్రాణాలు కోల్పోయారు. సంప్రదాయంలో భాగంగా నిద్రకు రమ్మని ములకలపల్లిలోని చిన్నాన్న పిలవడంతో సాయి కుటుంబం కారులో వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
తాళం వేసి వెళ్లిపోయిన ఇంటి యజమాని?
మృతదేహాలను ఇంటికి తేవద్దంటూ ఇంటి యజమాని సాయి బంధువులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. అద్దెకు ఉంటున్న వారి ఇంటికి మరో తాళం వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. మృతదేహాలను కనీసం ఇంటి ముందు రోడ్డుపై పెట్టేందుకైనా అనుమతించాలని కోరగా అందుకు కూడా అంగీకరించలేదని తెలిసింది. ఈ ఏడాది జనవరిలో సాయి తండ్రి శ్రీనివాసరావు చనిపోయినప్పుడు కూడా ఇదే రీతిలో వ్యవహరించబోతే స్థానికులు ఇంటి యజమానికి నచ్చజెప్పారు. అయితే ఈసారి ఏ మాత్రం అనుమతించేది లేదని ఇంటి యజమాని స్పష్టం చేసినట్లు తెలిసింది.