భద్రాద్రి ఆలయానికి 351 కోట్లు
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:34 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయానికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఆలయాన్ని మరింత విస్తరించి మూడు దశల్లో...
హైదరాబాద్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయానికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఆలయాన్ని మరింత విస్తరించి మూడు దశల్లో అభివృద్ధి చేసేలా రూ.586 కోట్లతో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో మొదటి దశలో చేపట్టనున్న పనుల కోసం రూ.351 కోట్లను బుధవారం ప్రభుత్వం విడుదలచేసింది. ఇందులో రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. రూ.180 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, అభివృద్ధి పనులు చేస్తారు. రూ.96 కోట్లతో రామాలయం పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపడతారు. ఈ పనులు వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయనున్నారు. మిగతా రెండు విడతల పనులను రూ.235 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భద్రాచలం టెంపుల్ టౌన్ ప్రాజెక్టు కూడా ఉంది. దీనిని 2027లో ప్రారంభించి 2029లో పూర్తిచేయనున్నారు. ఈ పనుల న్నీ పూర్తయితే తిరుమల తరహాలో భద్రాచలం రామాలయం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆలయ అభివృద్ధి పనుల కు 351 కోట్లు కేటాయించడంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.