Share News

మేము సీతారాముల కల్యాణం చేస్తాం

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:10 AM

భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో ఘోర అపచారం జరుగుతోందని పేరుకు సీతారామచంద్రస్వామి కల్యాణం అయినా దాన్ని లక్ష్మీనారాయణ కల్యాణం చేస్తున్నారని హిమాలయ...

మేము సీతారాముల కల్యాణం చేస్తాం

  • భద్రాచల ప్రాంత పరిరక్షణ సమితి చైర్మన్‌ శంకర్‌రెడ్డి

ఖైరతాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో ఘోర అపచారం జరుగుతోందని పేరుకు సీతారామచంద్రస్వామి కల్యాణం అయినా దాన్ని లక్ష్మీనారాయణ కల్యాణం చేస్తున్నారని హిమాలయ యోగి స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి విమర్శించారు. వెంటనే ఈ అపచారాన్ని సరిదిద్దుకొని ఈ సంవత్సరం సీతారామచంద్రస్వామి గోత్ర, ప్రవరాలతో కల్యాణం జరిపించాలన్నారు. లేనిపక్షంలో అక్కడి భక్తులను చైతన్యపరిచి అదేరోజు, అదేక్షేత్రంలో అదే ముహుర్తానికి సీతారామ కల్యాణం తాము జరిపిస్తామని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత 450 ఏళ్లుగా భధ్రాచలంలో ఎంతో భవ్యంగా, దివ్యంగా సీతారామకల్యాణం వైభవంగా జరుగుతుంది. కానీ గత కొన్నేళ్లుగా శుభలేఖలో సీతారామకల్యాణం అని వేయిస్తున్నా అక్కడ జరిపించేది మాత్రం లక్ష్మీనారాయణ కల్యాణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముడికి చెప్పవలసిన వశిష్ట గోత్రం స్థానంలో నారాయణుడి గోత్రాన్ని చెప్పడం.. రాముడి ప్రవర అయిన నాభగుడు, అంజుడు, దశరథుడు అనే పేర్ల స్థానంలో నారాయణుడి ప్రవర చదువుతున్నారని విమర్శించారు. అదేవిధంగా సీతాదేవికి చెప్పవలసిన గౌతమ గోత్రం స్థానంలో లక్ష్మీదేవి గోత్రాన్ని, సీతాదేవి ప్రవర అయిన స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, జనకుడు అనే పేర్ల స్థానంలో లక్ష్మీదేవి ప్రవర చదువుతున్నారని అన్నారు. ఈ విషయమై 2024 ఏప్రిల్‌లో హైకోర్టు న్యాయమూర్తి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఐదుగురు పండితులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ కమిటీ... తన నివేదికను ఇప్పటివరకు న్యాయస్థానానికి అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించి సీతారామ కల్యాణం వారి గోత్రం, ప్రవరలతో జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 27న సీతారామ కల్యాణం వేడుక కోసం సీఎంకు శుభలేఖ అందించారని కానీ అక్కడ జరిపించేది మాత్రం లక్ష్మీనారాయణ కల్యాణం అని, సీఎంను కూడా వీరు మోసం చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - Mar 21 , 2026 | 04:10 AM