నకిలీ నియామక పత్రాలతో.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏ మోసాలు
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:07 AM
ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేస్తుండడాన్ని అవకాశంగా మలచుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకుల వద్ద రూ.కోట్లలో వసూలు చేశాడు. ఏకంగా సంస్థల లెటర్ హెడ్‌లు తయారు చేసి..
సంస్థల లోగోలు, లెటర్‌హెడ్‌ల రూపకల్పన
అధికారుల సంతకాల ఫోర్జరీతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు
తవ్వినకొద్దీ మోసాలు.. కొర్ల కల్యాణ్‌పై కేసు
కొత్తగూడెం/భద్రాచలం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేస్తుండడాన్ని అవకాశంగా మలచుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకుల వద్ద రూ.కోట్లలో వసూలు చేశాడు. ఏకంగా సంస్థల లెటర్ హెడ్‌లు తయారు చేసి.. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి.. నకిలీ నియామక పత్రాలు సృష్టించి బాధితులకు ఇచ్చాడు. తీరా అవన్నీ బూటకమని తేలడం, మోసపోయిన బాధితులు లబోదిబోమనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ కొర్త కల్యాణ్‌కుమార్ చేసిన ఈ మోసాలు గత రెండు రోజులుగా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. విషయం ఎమ్మెల్యే వరకు చేరడం, బాధితులకు డబ్బులు చెల్లించాలని ఆయన హెచ్చరించడంతోపాటు పీఏను సరెండర్ చేయాలని లెక్టర్లకు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తన పీఏ తన దృష్టికి రానీయకుండా అనేక అక్రమాలకు పాల్పడినట్లు బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దీంతతో పీఏను సరెండర్‌ను చేయాల్సిందిగా లేఖ రాశానని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్, డీఎస్పీ అరుణ్‌కుమార్‌కు ఫోన్ చేసి కోరానని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే అనుచరుడైన రాయల శ్రీను కుమారుడికి కూడా ఉద్యోగం ఇప్పిస్తానని కొర్ల కల్యాణ్ మోసం చేశాడని భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్ తెలిపారు. రాయల శ్రీను నుంచి రూ.9.95 లక్షల నగదు తీసుకుని నకిలీ నియామక పత్రాన్ని ఇచ్చాడని చెప్పారు. దీనిపై రాయల శ్రీను చేసిన ఫిర్యాదు మేరకు కొర్ల కల్యాణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
విషయం వెలుగులోకి ఇలా..
కొర్ల కల్యాణ్ తన మోసాలకు ప్రధానంగా ఉద్యోగాలనే ఎరగా వాడుకున్నట్లు తెలుస్తోంది. బీటీ పీఎస్ భూ నిర్వాసితుల వివరాలను సేకరించి. వారికి ఫోన్లు చేసీ మరీ ఉద్యోగాల ఆశ చూపి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది. మొత్తంగా రూ.10 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. కల్యాణ్ మోసాలు తొలుత భద్రాద్రి జిల్లాలోనే వెలుగు చూడగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా అతడి బాధితులున్నట్లు తమ పరిశీలనలో తేలిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్టు పేర్కొంటున్నాయి. కల్యాణ్‌కు ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటు ఉన్నట్లు తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
నకిలీ నియామక పత్రాలతో..
కొర్ల కల్యాణ్.. పలు సంస్థల లోగోలు, లెటర్‌హెడ్‌లు రూపొందించి అధికారుల సంతకాలను పోలిన సంతకాలతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసి ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో వారిని ఓ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ వద్దకు స్వయంగా తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే కొద్దిసేపటికే తిరిగి వచ్చి మరో వారం రోజుల్లో వెరిఫికేషన్ పూర్తవుతుందని, కంపెనీ నుంచి అపాయింట్‌మెంట్ కోసం ఫోన్ వస్తుందని చెప్పినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. రోజులు గడిచినా ఫోన్ రాకపోవడంతో బాఽధితులు ఆందోళనకు గురై ప్రశ్నించగా కొంత సమయం పడుతుందని, భూమికి సంబంధించిన సమస్యలున్నాయని చెప్పాడని పలువురు వాపోతున్నారు.