Share News

Deceptive Tactics in Cockfights: బరిలో మోసగాళ్లు.. సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు..

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:45 AM

జూదమంటేనే మోసం. మహాభారత కాలం నుంచీ అదే జరుగుతోంది. కోడి పందేలైనా, పేకాడ, గుండాట లాంటి గ్యాంబ్లింగ్‌ గేమ్‌లైనా.. చివరకు మిగిలేది జేబుకు చిల్లే. మనరాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే జూదగాళ్లకు హుషారొస్తుంది.

Deceptive Tactics in Cockfights: బరిలో మోసగాళ్లు.. సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు..

  • కోడి పందేల్లో కనిపెట్టలేని మోసాలు.. సొమ్ములు కొల్లగొట్టేందుకు ఎత్తులు

  • మత్తు మందుతో కోళ్లను చిత్తు చేస్తారు

  • జోడీ పందేల్లో లాఘవంగా డబ్బు లాగేస్తారు

  • డమ్మీ కత్తులు కట్టి కనికట్టు చేస్తారు

  • బ్రేకులతో గెలుపోటములు మార్చేస్తారు

  • జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గుల్లే

(తాడేపల్లిగూడెం రూరల్‌-ఆంధ్రజ్యోతి)

జూదమంటేనే మోసం. మహాభారత కాలం నుంచీ అదే జరుగుతోంది. కోడి పందేలైనా, పేకాడ, గుండాట లాంటి గ్యాంబ్లింగ్‌ గేమ్‌లైనా.. చివరకు మిగిలేది జేబుకు చిల్లే. మనరాష్ట్రంలో సంక్రాంతి వచ్చిందంటే జూదగాళ్లకు హుషారొస్తుంది. బరిలో కోడి కాలు దువ్వుతుంటే.. ఆస్తులు పణంగా పెట్టడానికి పందెం రాయుళ్లు సిద్ధమవుతారు. పౌరుషంగా పందేల మీద పందేలు కాస్తారు. ఇదే మోసగాళ్లకు కావాల్సింది. వెంటనే బరిలోకి దిగిపోతారు. తిమ్మిని బమ్మిని చేస్తారు. గెలిచే కోడి ఓడి పోతుంది. ఓడి పోతుంది అనుకున్న కోడి గెలిచేస్తుంది. కోట్లు చేతులు మారి పోతాయి. జీవితాలు తారుమారైపోతాయి. ఈ ఏడాది సంక్రాంతికి కోస్తా జిల్లాల్లో కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. పల్లెల్లో కొన్ని చోట్ల ఇప్పటికే కోళ్లు కాలు దువ్వుతున్నాయి. పందెంరాయుళ్లు కూడా క్యాష్‌ రెడీ చేసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హోరాహోరీగా సాగే కోడి పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి. ఈ పందేల్లో సాధారణ జనం జేబులు ఖాళీ చేసుకోవడం మినహా సంపాదించే వారు చాలా అరుదే. జనం సొమ్ములు కాజేసేందుకు బరిలో చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావు. వీటిపై ఓ లుక్‌ వేయకుంటే మాత్రం నిండా మునిగిపోవడం ఖాయం. ముఖ్యంగా నాలుగు రకాల మొసాలు ఎలా జరుగుతాయి అన్న వివరాలతో ఆంధ్రజ్యోతి కథనం ఇదీ..

మోసం నంబరు 1

ఓ బరిలో రెండు పుంజులను రంగంలోకి దింపుతారు. రెండూ పోటాపోటీగా కనిపిస్తాయి. ఓ పుంజు రంగు, రెక్కలు అన్నింటిని బేరీజు వేసుకుని పందెం రాయుళ్లు అంతా ఆ పుంజుపై భారీగా పందేలు కాస్తారు. అందరూ గెలుస్తుందనుకున్న పుంజు గాలిలోనే ఎగురుతుంది. కానీ అవతలి పుంజుకు అసలు దెబ్బ తగలదు. పంచ్‌ గురి తప్పుతుంది. అవతలి వైపు పుంజు రెండు దెబ్బలు వేసే సరికి ఈ పుంజు నేలకొరిగిపోతుంది. ఏమైందో ఎవరికీ అర్థం కాదు. పందెం కాసిన వాళ్లు డీలా పడిపోతారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే పందెంలో మోసం జరగడమే కారణం. ఏమిటా మోసమని విచారిస్తే ఒక పుంజు చెవులు, నెత్తి మీద.. చెరువుల వద్ద కొంగలకు మత్తు కోసం పెట్టే మందును రాస్తారు. పుంజులను బరిలో దింపే సమయంలో వాటికి పౌరుషం వచ్చేందుకు రెండు పుంజులను కరిపిస్తుంటారు. అలా కరిపించినప్పుడు ఓ పుంజుకు మత్తు ఎక్కి బరిలో ఏం చేయాలో తెలియని స్థితికి చేరుతుంది. ఆ సమయంలో అవతలి పుంజు బలంగా కత్తి గాట్లతో ఈ పుంజును నేలకరిపిస్తుంది. ఈ విషయం తెలియక ఎంతో మంది మోసపోతుంటారు.


మోసం నంబరు 2

మరో రకమైనది జోడీల మోసం. ఉదాహరణకు సుబ్బారావు, రమేశ్‌ జోడీ పందేలకు సిద్ధమవుతారు. బరిలో ఇద్దరూ పది జోడీ పందేలు వేసే సమయంలో సుబ్బారావు తరఫున ఒకసారి బలంగా ఉండి గట్టిగా పోట్లాడే పుంజును దింపుతాడు. అవతలి వైపు నుంచి రమేశ్‌ మాత్రం చూడటానికి బలంగా ఉన్నా బరిలో బాగా ఎగలేని పుంజును పోటీకి నిలుపుతాడు. దీంతో సుబ్బారావు పుంజు రెండు దెబ్బలు కొట్టే సరికి రమేశ్‌ పుంజు నేలకొరిగిపోతుంది. దీంతో ఒక పందెం గెలిచిన సుబ్బారావు వైపు పుంజులు బాగున్నాయని పందేలు కాసేవారు సుబ్బారావు ఎక్కువగా కాస్తారు. అయితే రెండో సారి సీన్‌ రివర్స్‌ చేస్తారు. సుబ్బారావు పుంజు బలంగా కనిపించినా చురుకుదనం లేక చతికిలపడుతుంది. ఈసారి రమేశ్‌ పుంజు గెలుస్తుంది. ఇది మధ్యలో పందేలు కాసే వారిని మోసం చేయడమే.

మోసం నంబరు 3

ఎవరి పుంజు గెలవాలో ఎవరి పుంజు ఓడిపోవాలో నిర్ణయించేది కత్తులు కట్టే టెక్నిక్‌. కత్తులు రెండు షార్ప్‌గా ఉన్నా ఒక వైపు డమ్మీ కత్తి మరో వైపు అసలు కత్తి కట్టి మోసం చేస్తారు. నిజానికి అసలు కత్తి కంటే డమ్మీ కత్తే పదునుగా కనిపిస్తుంది. కానీ ఆ కత్తి పదును పుంజులను బరిలో దింపే ముందు నడిపించే సమయంలోనే పోతుంది. దీంతో ఓ వైపు డమ్మీ కత్తి కట్టిన పుంజు ఎంత బలంగా తలపడినా పోటీ పుంజుకు చర్మం చీలే దెబ్బలే తగులుతాయి. కానీ పోటీ పుంజు కొట్టే దెబ్బలకు డమ్మీ కత్తి కట్టిన పుంజుకు మాత్రం కండలు చీలుకుపోయి ప్రాణాల మీదకు వస్తుంది.

మోసం నంబరు 4

కోడి పందేల మోసాల్లో మధ్యవర్తుల వ్యవహారం కూడా పుంజుల గెలుపోటములను నిర్ణయిస్తాయి. పుంజులు తలపడేప్పుడు మధ్యవర్తులు తాము గెలవాలనుకున్న పుంజు కాకుండా, అవతలి వైపు పుంజు బలంగా తలపడుతున్న సమయంలో సడెన్‌గా పోటీకి బ్రేక్‌ ఇస్తుంటారు. గెలిచే పుంజు జోరును తగ్గించడం కోసం ఇది ఓ రకమైన టెక్నిక్‌. అయితే ఓటమి అంచులో ఉన్న పుంజు చివరి నిమిషంలో విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా పోరాడుతుంది. ఆ సమయంలో ఓడిపోయే పుంజును గెలిపించేందుకు పలు ఎత్తుగడలు వేస్తుంటారు. ఇలా కోడి పందేల్లో ఎన్నో మోసాలు చేసి జనం డబ్బులు కొల్లగొడుతుంటారు.

Updated Date - Jan 10 , 2026 | 06:26 AM