Share News

kumaram bheem asifabad- విపత్తులపై అప్రమత్తంగా వ్యవహరించాలి

ABN , Publish Date - Jun 05 , 2026 | 10:21 PM

ప్రకృతి విపత్తుల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌మర్మాట్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- విపత్తులపై అప్రమత్తంగా వ్యవహరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి విపత్తుల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌మర్మాట్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వరదలు, విపత్తులు సంభవించినప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అగ్ని మాపక శాఖల ఆధ్వర్యంలో వరదల నుంచి ప్రజలను రక్షించడానికి బోట్లు, లైవ్‌ జాకెట్లు, అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. శిక్షణ పొందిన సిబ్బందిని సహాయక చర్యలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పంచాయతీ రాజ్‌, ఇంజనీరింగ్‌, రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రహదారులు, కల్వర్టులు, లో లెవల్‌ వంతెనల మరమ్మతులు చేపట్టాలన్నారు. కల్వర్టులలో పైపులలో ఉన్న చెత్తను తొలగించాలని తెలిపారు. మిషన్‌ భగీరథ శాఖ అధికారులు తమ పరిధిలోని ట్యాంకులు, పైపు లైన్‌ మరమ్మతులు చేయాలని సూచించారు. నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నాలాల్లో పూడిక తొలగించాలని చెప్పారు. మురుగు కాలువలను శుభ్రం చేయాలని, అవసరమైన బ్లీచింగ్‌ పౌడర్‌, దోమల మందులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువులు, కాలువల మరమ్మతులు, ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రాజెక్టులోకి వచ్చే వరదలపై సమీక్షించుకోవాలని, ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను గుర్తించి సిద్ధం చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నెలలు నిండిన గర్భిణులను వరదలు సంభవించే ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. డయాలసిస్‌, ఆస్తమా రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను గుర్తించాలని చెప్పారు. గ్రామాల్లో, మున్సిపాలిటీలలో పాత బడిన గృహాలను గుర్తించి అందులో నివసిసంచే వారిని సురక్షిత ప్రాంతాలలో ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేయాలని, వరదలలో మునిగే పంట ప్రాంతాలను ముందుగానే గుర్తించి జాబితా సిద్ధం చేయాలన్నారు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో వంగిన, విరిగిన స్తంభాలను, వదులుగా ఉన్న, వేలాడుతున్న విద్యుత్‌ తీగలను వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ అధికా రులు సమన్వయంతో వ్యవహరించి వరదలు, విపత్తులు సంభవించినప్పుడు జనజీవ నానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Jun 05 , 2026 | 10:21 PM