Share News

kumaram bheem asifabad- సైబర్‌ నేరాలపై జాగ్రత్త

ABN , Publish Date - Aug 04 , 2026 | 10:42 PM

అపరిచితులు పంపించే లింక్‌లను నిర్లక్ష్యంగా ఓపెన్‌ చేయడం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి రుజువైంది. ఎరువుల దుకాణం ఏర్పాటుకు రుణం ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి సుమారు రూ.5 లక్షలు కాజేసిన సైబర్‌ మోసగాళ్ల ఘటన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది.

kumaram bheem asifabad- సైబర్‌ నేరాలపై జాగ్రత్త
లోగో

- ఎరువుల దుకాణం రుణం పేరుతో మోసం

- ఈమెయిల్‌లో వచ్చిన లింక్‌ ఓపెన్‌ చేసిన బాధితుడు

- లైసెన్స్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ ఛార్జీల పేరుతో విడతల వారీగా వసూళ్లు

- రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): అపరిచితులు పంపించే లింక్‌లను నిర్లక్ష్యంగా ఓపెన్‌ చేయడం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి రుజువైంది. ఎరువుల దుకాణం ఏర్పాటుకు రుణం ఇప్పిస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి సుమారు రూ.5 లక్షలు కాజేసిన సైబర్‌ మోసగాళ్ల ఘటన కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. రుణం పేరుతో ప్రారంభమైన పరిచయం చివరకు భారీ ఆర్థిక నష్టానికి దారితీయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

- అపరిచితుడి లింక్‌..

రెబ్బెన పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తికి ఈమెయిల్‌ ద్వారా ఓ అపరిచితుడు లింక్‌ పంపించాడు. ఆ లింక్‌ను బాధితుడు ఓపెన్‌చేశాడు. లింక్‌ను ఓపెన్‌ చేసినట్లు గుర్తించిన సైబర్‌ మోసగాడు వెంటనే ఫోన్‌చేశాడు. ఎరువుల దుకాణం ఏర్పాటు కోసం తక్కువ వడ్డీతో రుణం మంజూరు చేస్తామని నమ్మబలికాడు. ఇందుకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేయాలని సూచించాడు.రుణం వస్తుందన్న ఆశతో బాధితుడు మోసగాడు చెప్పినట్లుగానే ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేసి దరఖాస్తును పూర్తి చేశాడు. అనంతరం రుణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పిన సైబర్‌ మోసగాడు ముందుగా లైసెన్స్‌ ఫీజు పేరుతో రూ10,500 చెల్లించాలని కోరాడు. ఆ తర్వాత ప్రాసెసింగ్‌ ఛార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ధ్రువీకరణ చార్జీలు తదితర పేర్లతో విడతల వారీగా రూ.1.5 లక్షలు చొప్పున పలుమార్లు నగదు బదిలీ చేయించుకున్నాడు. ఇలా వివిధ కారణాలు చెబుతూ మొత్తంగా సుమారు రూ.5 లక్షలు బాధితుడి నుంచి దోచుకున్నాడు.కొన్ని రోజుల తర్వాత కూడా రుణం మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీయగా తాను సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తించాడు. దీంతో జూలై 21న రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డబ్బులు బదిలీ అయిన ఖాతాలు, ఫోన్‌నంబర్లు, ఆన్‌లై న్‌లావాదేవీల వివరాలను సేకరించి మోసగాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు.

జాగ్రత్తగా ఉండాలి..

- నితికా పంత్‌, కుమరం భీం జిల్లా ఎస్పీ

సైబర్‌ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులు పంపించే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌ చేయవద్దు. తెలియని వ్యక్తులు రుణాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ పథ కాలు లేదా ఇతర ఆఫర్ల పేరుతో డబ్బులు అడిగితే నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాం కు వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్‌ మోసంపై అనుమానం వచ్చిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు 1930 సైబర్‌ హెల్ప్‌ డెస్క్‌ సమాచారం అందించాలి.

Updated Date - Aug 04 , 2026 | 10:42 PM