kumaram bheem asifabad-విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:04 PM
ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అపమత్తంగా ఉండాలని ఎస్పీ నితికాపంత్ అన్నారు. కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ నితికాపంత్ పర్యవేక్షించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సీ తెలిపారు
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అపమత్తంగా ఉండాలని ఎస్పీ నితికాపంత్ అన్నారు. కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ నితికాపంత్ పర్యవేక్షించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సీ తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వృద్ధులు, దివ్యాంగులకు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతుందని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందకుండా ఓటు వేయాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా బందోబస్తు విషయంలో డీఎస్పీతో అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారితో వివిధ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు పక్కాగా పాటించాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వహీదోద్దీన్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, వెలుతురు, నీడ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం వీల్ చైర్‌లు అందుబాటులో ఉంచామని తెలిపారు. అత్యవసరమైన సమయంలో వైద్య సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఇబ్బంది తలెత్తకుడా ప్రశాంతంగా ఓటు వినియోగించుకునేందుకు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం 12లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట ట్రైనీ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, పోలింగ్ సిబ్బంది ఉన్నారు.