బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఇస్తారా?
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:56 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకుడు బుట్టెంగారి మాధవరెడ్డికి ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడమేంటని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ 48 గంటల్లో స్పందించాలి
బుట్టెంగారి మాధవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలి: జాజుల
పంజాగుట్ట, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకుడు బుట్టెంగారి మాధవరెడ్డికి ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడమేంటని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ పదో వార్డు కౌన్సిలర్ స్థానానికి మాధవరెడ్డికి ఇచ్చిన బీఫామ్‌ను బీఆర్‌ఎస్ వెన క్కి తీసుకోవాలని, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో బీఆర్‌ఎస్ 48 గంటల్లోగా వివరణ ఇవ్వకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేస్తామని హెచ్చరించారు. బుట్టెంగారి మాధవరెడ్డి కాంగ్రెస్ వ్యక్తి అని, సీఎం రేవంత్ రెడ్డి మనిషి అని బీఆర్‌ఎస్ పార్టీ గతంలో ఆరోపించింది. ఇప్పుడు అదే బీఆర్‌ఎస్ పార్టీ ఆయన్ను పార్టీలో చేర్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఫామ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువా రం విలేకరులతో మాట్లాడిన బీసీ జేఎసీ రాష్ట్ర చైర్మన్ జాజులు బీఆర్‌ఎస్ పార్టీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో నెంబరు 9ను జారీ చేయగా.. దానిపై న్యాయస్థానానికి వెళ్లిన బుట్టెంగారి మాధవరెడ్డి ఆ జీవోను రద్దు చేయించారని జాజుల తెలిపారు. మాధవ రెడ్డి వెనుక ఏ శక్తి ఉందో తేలాలన్నారు. ఇన్నాళ్లూ బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నామంటూ నమ్మబలికిన బీఆర్‌ఎస్.. బీసీల ద్రోహిని పార్టీలోకి చేర్చుకుని తన వైఖరిని బహిర్గతం చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌కు బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మాధవరెడ్డిని 48 గంటల్లోగా పార్టీ నుంచి బహిష్కరించాలని, అతనితో నామినేషన్ విత్ డ్రా చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీ రిజర్వేషన్లను మాధవరెడ్డి ద్వారా అడ్డుకున్నది బీఆర్‌ఎస్సేనని ప్రకటించి, ఆయనను చిత్తుగా ఓడించి తమ సత్తా చూపుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామన్నారు. బీసీల ద్రోహుల పార్టీగా బీఆర్‌ఎ్‌సను ప్రకటించి, రాజకీయంగా బొంద పెడతామని హెచ్చరించారు.