ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుకు కుట్ర : జాజుల
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:01 AM
బడుగు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో చేస్తోందని అఖిలపక్ష పార్టీల నేతలు....
కవాడిగూడ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): బడుగు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో చేస్తోందని అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు ఆరోపించారు. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని, వచ్చే బడ్జెట్‌లో ఇందుకోసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు వద్ద బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ‘ఫీజు పోరు దీక్ష’ చేపట్టారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ.. బడుగు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7,500 కోట్ల విడుదల చేయడానికి సీఎం, డిప్యూటీ సీఎంలకు కనికరం కలగడం లేదన్నారు. కానీ, గాంధీ విగ్రహం ఏర్పాటుకు రూ.5,000 కోట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఉద్దేశ పూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎల్.రమణ, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ యాదవ్, సినీ దర్శకులు ఎన్.శంకర్, బీసీ ఉద్యమ నేత వీజీఆర్ నారగోని, సీపీఐ నేత జి.నరసింహ, టీజేఎస్ ఉపాధ్యక్షుడు ఎన్.రమేశ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.