‘పుర’ ప్రథముల్లో 61శాతం బీసీలే
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:35 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వారు సత్తా చాటుతూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల...
105 మునిసిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్‌పర్సన్లు
వైస్ చైర్‌పర్సన్లుగా 41 శాతం బీసీలే ఎన్నిక
ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహా..
అన్నిచోట్లా 55 శాతానికి పైగా వార్డుల్లో బీసీలదే గెలుపు
ఏడు కార్పొరేషన్లలో నలుగురు బీసీ మేయర్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వ ర్క్)
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వారు సత్తా చాటుతూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు దక్కించుకున్న బీసీలు... తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ ఆధిపత్యం చూపారు. మునిసిపల్ చైర్మన్ పదవుల్లో ఏకంగా 60.95 శాతం సొంతం చేసుకుని, పట్టణాల్లో ప్రథమ పౌరులుగా అందలమెక్కారు. ఎన్నికలు పూర్తయిన 105 మునిసిపాలిటీల్లో 64 మంది బీసీలే చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్ల పదవుల్లోనూ 41 శాతం మంది బీసీలే ఉన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లలోనూ బీసీలు సత్తా చాటారు. ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, నాలుగు కార్పొరేషన్లలో బీసీలే మేయర్ పదవులు దక్కించుకున్నారు. మొత్తం పదవుల్లో ఇది 57.14 శాతం. ఏడు మునిసిపల్ కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా, సోమవారం 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతోపాటు 105 మునిసిపాలిటీల్లో చైర్ పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో బీసీలు మేయర్లుగా ఎన్నికయ్యారు. మంచిర్యాల, రామగుండంలో బీసీలు డిప్యూటీ మేయర్లుగా గెలిచారు. ఇది 28.57 శాతం. ఎన్నికలు పూర్తయిన మున్సిపాలిటీల్లో 64 మంది బీసీలు చైర్‌పర్సన్లు (60.95 శాతం)గా, 43 మంది బీసీలు వైస్ చైర్‌పర్సన్లు (41 శాతం)గా ఎన్నికయ్యారు.