Share News

బీసీలకు న్యాయం చేయకుంటే అసెంబ్లీ ముట్టడి

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:45 AM

బడ్జెట్‌ కేటాయింపుల్లో మరోసారి బీసీలకు అన్యాయం జరిగిందని.. దాన్ని సరిదిద్దకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

బీసీలకు న్యాయం చేయకుంటే అసెంబ్లీ ముట్టడి

  • బీసీ సబ్‌ ప్లాన్‌ చట్టం చేయాల్సిందే: జాజుల

పంజాగుట్ట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌ కేటాయింపుల్లో మరోసారి బీసీలకు అన్యాయం జరిగిందని.. దాన్ని సరిదిద్దకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయించాలని.. చట్టబద్ధమైన బీసీ సబ్‌ ప్లాన్‌ తేవడానికి తక్షణమే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలన్నారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ‘రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల వాటా’ అంశంపై అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల సమావేశం జరిగింది. జాజుల మాట్లాడుతూ.. బీసీలకు బడ్జెట్‌లో భిక్షంగా కాకుండా, ఒక హక్కుగా దక్కాలంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగా బీసీలకు కూడా చట్టబద్ధమైన సబ్‌ ప్లాన్‌ తేవాలన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించి కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను అవమానించిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, బీసీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. జనాభాలో ఎవరెంతో వారికంత వాటా దక్కాలనే రాహుల్‌ గాంధీ సూత్రం రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 06:46 AM