పుర పోరులో బీసీలకు 56శాతం టికెట్లివ్వాలి: జాజుల
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:08 AM
మునిసిపల్ ఎన్నికల్లో.. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 56శాతం టికెట్లు కేటాయించి కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో.. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 56శాతం టికెట్లు కేటాయించి కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల జనాభా ఎంత ఉందో అదేస్థాయిలో రిజర్వేషన్లు అమలు కావాలన్న రాహుల్ గాంధీ నినాదాన్ని తు.చ. తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. బీసీలకు 56శాతం కోటా కింద.. కనీసం 68 మునిసిపల్ చైర్మన్ పదవులను కేటాయించాలని బీసీ జేఏసీ కోరింది. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌లు మాట్లాడుతూ.. రాజకీయంగా బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు పార్టీ శ్రేణులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.