కుమ్మెర ఘటనపై బీసీ కమిషన్ సీరియస్
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:45 AM
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన తోపులాటలో రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించింది.
‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని సుమోటోగా తీసుకున్న కమిషన్
పసికందు మృతిపై సమగ్ర నివేదిక కోరిన చైర్మన్ నిరంజన్
హైదరాబాద్/గన్‌పార్క్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన తోపులాటలో రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. కుల వివక్ష వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ సుమోటోగా స్వీకరించి.. దేవాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. కుమ్మెర జాతరలో కుల వివక్ష, ప్రవేశ రుసుము వసూలు, భద్రతా వైఫల్యంపై సమగ్ర విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అంతేకాకుండా.. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు బీసీ కమిషన్ బృందం మంగళవారం కమ్మెర గ్రామానికి వెళ్లనుంది. కమిషన్ పర్యటన దృష్ట్యా తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. విచారణ సమయంలో జిల్లా ఉన్నతాధికారులు కమిషన్ వెంట ఉండాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో బీసీ కమిషన్ చైర్మన్‌తోపాటు సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు పాల్గొననున్నారు. కుమ్మెర గ్రామంలో బీసీ, దళిత కుటుంబాలపై దాడి, రెండు నెలల పసికందు మృతిపై బీసీ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం డీజీపీ శివధర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. కేసును నీరుగార్చేందుకు కుట్రలు పన్నిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎస్సై, సీఐలపైనా హత్యా నేరం కేసులను నమోదు చేయాలన్నారు.