Share News

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు కోల్‌ ఇండియా, సారస్‌ చేతికి..

ABN , Publish Date - May 19 , 2026 | 05:37 AM

రాష్ట్రంలో రెండు చోట్ల నిర్మించతలపెట్టిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ (బెస్‌) ప్రాజెక్టులను కోల్‌ ఇండియా, సారస్‌ సంస్థలు దక్కించుకున్నాయి.

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు కోల్‌ ఇండియా, సారస్‌ చేతికి..

  • ఈఆర్‌సీలో విద్యుత్‌ కొనుగోలు కోసండిస్కమ్‌లు, ధర ఖరారుపై జెన్‌కో పిటిషన్‌

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు చోట్ల నిర్మించతలపెట్టిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ (బెస్‌) ప్రాజెక్టులను కోల్‌ ఇండియా, సారస్‌ సంస్థలు దక్కించుకున్నాయి. రోజుకు 4 గంటల పాటు విద్యుత్‌ను అందించడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 30వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపగా... అందులో తెలంగాణకు 1500 మెగావాట్ల ప్లాంట్లు మంజూరయ్యాయి. మహేశ్వరంలో 750 మెగావాట్ల ప్లాంట్‌ ఏర్పాటుకు సారస్‌ సంస్థ ముందుకొచ్చింది. దేశంలోనే అతి తక్కువ ధరకు ఈ సంస్థ టెండర్‌ వేసింది. ఒక మెగావాట్‌కు వయబుల్టీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) కింద కేంద్రం రూ.18లక్షలు సమకూరుస్తుండగా, ఆ మొత్తం పోనూ.. ఒక్కో మెగావాట్‌కు రూ.2.98 లక్షల చొప్పున ఆ సంస్థ కోట్‌ చేసింది. దీంతో ఆ సంస్థకే పనులు అప్పగిస్తూ తెలంగాణ జెన్‌కో నిర్ణయం తీసుకుంది. ఇక, చౌటుప్పల్‌లో 750 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఏర్పాటుకు కోల్‌ ఇండియా ముందుకొచ్చింది. వీజీఎఫ్‌ పోను... ఒక్కో మెగావాట్‌కు రూ.3.14లక్షల చొప్పున ఈ సంస్థ టెండర్‌ వేసింది. ఈ మేరకు వీటి నుంచి ఉత్పత్తయ్యే కరెంట్‌కు ధరను ఖరారు చేయాలని తెలంగాణ జెన్‌కో, విద్యుత్‌ కొనుగోలు చేయడానికి సమ్మతి కోరుతూ డిస్కమ్‌లు టీజీఈఆర్‌సీలో పిటిషన్లు వేశాయి. వీటిపై జూన్‌8వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు/సూచనలు/సలహాలు స్వీకరించడానికి వీలుగా సోమవారం ఈఆర్‌సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూన్‌ 18వ తేదీన ఈఆర్‌సీ కార్యాలయంలో బహిరంగ విచారణ జరగనుంది. కాగా, హైదరాబాద్‌ శివారులోని శంకర్‌పల్లిలోనూ మరో 250 మెగావాట్ల ప్లాంట్‌ ఏర్పాటుకు సారస్‌ సంస్థ ఆసక్తి చూపుతోంది. మూడు చోట్ల కూడా బిల్డ్‌... ఓన్‌... ఆపరేట్‌ (బూ) విధానంలో టెండర్లు పిలిచారు.15 ఏళ్లపాటు ఈ ప్లాంట్‌ నిర్వహణ అంతా ఆయా సంస్థలే చూసుకోనున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాటరీఎనర్జీ స్టోరేజీ విద్యుత్‌ సగటునయూనిట్‌కు 3.09నుంచి రూ.3.53కు లభిస్తోంది. దాంతో అటుఇటుగా ఇదేధర ఖరారు కానుంది. ఈ ప్లాం ట్లు ఏర్పాటైతే డిమాండ్‌ అధికంగా ఉన్న సమయంలో తక్కువధరకే డిస్కమ్‌లకు విద్యుత్‌ లభ్యం కానుంది.

Updated Date - May 19 , 2026 | 05:37 AM