Share News

బీఏఎస్ఎఫ్‌ నుంచి 2 జీసీసీలు!

ABN , Publish Date - May 06 , 2026 | 07:32 AM

రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటైన జర్మన్‌ దిగ్గజం బీఏఎ్‌సఎఫ్‌.. హైదరాబాద్‌లో రెండు జీసీసీ (గ్లోబల్‌ కేపబుల్‌ సెంటర్‌)లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

బీఏఎస్ఎఫ్‌ నుంచి  2 జీసీసీలు!

  • 3వేల మంది కొత్తగా ఉద్యోగాలు

  • ఏరోస్పేస్‌ దిగ్గజ హబ్‌గా తెలంగాణ

  • డ్రోన్‌ టెక్నాలజీ, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌లోనూ

  • గ్లోబల్‌ లీడర్‌గా నిలుపుతాం: దుద్దిళ్ల

హైదరాబాద్‌, మహేశ్వరం, మే 5 (ఆంధ్రజ్యోతి): రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటైన జర్మన్‌ దిగ్గజం బీఏఎ్‌సఎఫ్‌.. హైదరాబాద్‌లో రెండు జీసీసీ (గ్లోబల్‌ కేపబుల్‌ సెంటర్‌)లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌, గ్లోబల్‌ సర్వీసెస్‌ హబ్‌ల పేరుతో నెలకొల్పే ఈ రెండు జీసీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం సమర్పించింది. మంగళవారం తాజ్‌ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సమక్షంలో తెలంగాణ లైఫ్‌సైన్సెస్‌ సీఈవో సర్వేశ్‌ సింగ్‌కు బీఏఎస్ఎఫ్‌ సంస్థ గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ అధ్యక్షుడు టోబియాస్‌ డ్రాట్‌ అంగీకార పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ ఇప్పటివరకు ఏడాదికి 75 జీసీసీలు ఏర్పాటు అవుతూ వస్తున్నాయని, కానీ ఈ ఏడాది 100 జీసీసీల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. రెండు జీసీసీల వల్ల 3వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌ను కార్యాలయాల కేంద్రంగా మాత్రమే కాకుండా, ఆవిష్కరణలు, ఇంజినీరింగ్‌ రంగాల్లో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్థి చేస్తున్నట్టు శ్రీధర్‌ బాబు తెలిపారు.. ‘‘160 ఏళ్ల చరిత్ర కలిగిన బీఏఎస్ఎఫ్‌ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోని పలు నగరాలతో పోటీ పడి హైదరాబాద్‌ ఈ గొప్ప అవకాశాన్ని దక్కించుకోవడం రాష్ట్రానికి దక్కిన గౌరవం.


ఎన్విడియా, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, వాన్‌గార్డ్‌, ఎలీ లిల్లీ, మారియట్‌ ఇంటర్నేషనల్‌ లాంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ జీసీసీలు ఏర్పాటు చేసి హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి’’ అని శ్రీధర్‌ బాబు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ హార్డ్‌ వేర్‌ పార్క్‌ (ఫేజ్‌ - 3)లో రూ.453 కోట్ల పెట్టుబడితో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ‘ఐటీపీ ఏరో - ఇండియా’ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌కు శ్రీధర్‌బాబు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఏరోస్పేస్‌ దిగ్గజాలకు తెలంగాణను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్థంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలిపామన్నారు.

Updated Date - May 06 , 2026 | 07:32 AM