ఇబ్బందులొచ్చినా సేవలందించాం
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:48 AM
ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి తన సేవలను అన్ని వేళలా కొనసాగించిందని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు.
అమరావతిలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణం, హైదరాబాద్ ఆస్పత్రి విస్తరణను వేగంగా పూర్తిచేస్తాం: నందమూరి బాలకృష్ణ
ఆస్పత్రికి రూ.కోటి విరాళమిచ్చిన ప్రవాస భారతీయుడు పోలవరపు మాధవరావు
హైదరాబాద్ సిటీ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి తన సేవలను అన్ని వేళలా కొనసాగించిందని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఆస్పత్రి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా, బసవతారకం ట్రస్టు బోర్డు సభ్యులు రాఘవరావు, నోరి దత్తాత్రేయుడు, జే ఎస్ఆర్ ప్రసాద్, టీఎస్ రావులు విశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అమరావతిలోని తుళ్లూరులో బసవతారకం ఆస్పత్రి నిర్మాణం, హైదరాబాదులో ఉన్న ఆస్పత్రి విస్తరణ పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. బసవతారకం సిబ్బంది తన కుటుంబమని, ప్రతి ఏటా చైర్మన్స్ డే నిర్వహిస్తూ ఈ కుటుంబాన్ని కలవాలని తీర్మానించినట్లు ఆయన తెలిపారు. క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలను విస్తరించడం సంతోషకరమన్నారు. ట్రస్టు బోర్డు సభ్యుడు జేఎ్‌సఆర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సంస్థ ప్రారంభం నుంచి దాతలు చేసిన సహాయం మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా పలువురు దాతలు బసవతారకం ఆస్పత్రి విస్తరణ, నిర్మాణం కోసం విరాళాలిచ్చారు. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు పోలవరపు మాధవరావు కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు. ఆయన తరఫున వారి కు టుంబ సభ్యులు బాలకృష్ణకు ఈ డబ్బును అందజేశారు. జిలాయత్ గౌస్ ఇనాయత్ రూ.లక్ష, అనంతపురం జిల్లా సుధాకర నాయుడు లక్ష రూపాయలు, సింగరాయం రంజిత్ కుమార్ 50 వేలు విరాళం అందించారు.