బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్‌గా బసవరాజు
ABN , Publish Date - May 13 , 2026 | 04:17 AM
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్‌గా ప్రముఖ సామాజిక సేవకుడు, భారత్ సేవా సహకార్ ఫోరం (బీఎస్ఎస్ఎఫ్) చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌లు నియమితులయ్యారు..
వైస్ చైర్మన్‌గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్
మన్సూరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్‌గా ప్రముఖ సామాజిక సేవకుడు, భారత్ సేవా సహకార్ ఫోరం (బీఎస్ఎస్ఎఫ్) చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14న నాగోల్ బండ్లగూడలోని వసంత్ విహార్ ఫంక్షన్ హాలులో వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ హాజరు కానున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన బసవరాజు శ్రీనివాస్ హైదరాబాద్‌లో 1996లో బీఎస్ఎస్ఎఫ్‌ను స్థాపించి మూడు దశాబ్దాలుగా పలు సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపడుతూ వేలాది మంది పేదల జీవితంలో వెలుగులు నింపుతున్నారు. ఆయన ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ బిరుదుతో పాటు ‘ఇండియన్ హ్యూమానిటేరియన్’, ‘భారత్ గౌరవ పురస్కార్’ వంటి అవార్డులనూ అందించి గౌరవించింది. కాగా, బసవరాజు శ్రీనివాస్ నియామకం బ్రాహ్మణ సమాజానికి గర్వకారణమని బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీసెస్ (బాస్) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.